ఖమ్మం అర్బన్, మే 21 : జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈసారి ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్వెంట్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు. రెండు సెషన్లలో నిర్వహించనున్న పరీక్ష కోసం జిల్లాలో 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన జాగ్రత్తల గురించి వివరించారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆదివారం సైతం పరీక్ష నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 9,204 మంది, ఒకేషనల్‌లో 673 మంది, బ్యాక్లాగ్ 1,903 మంది.. మొత్తం 11,780 మంది పరీక్ష రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 3,143 మంది, ఒకేషనల్‌లో 538 మంది.. మొత్తం 3,681 మంది పరీక్ష రాయనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 15,461 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జిల్లా ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు సిట్టింగ్ స్కాడ్స్, ఫ్లయింగ్ స్కాడ్స్కి సూచించారు. బుధవారం డీఐఈవో కార్యాలయంలో సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్స్‌తో సమావేశం నిర్వహించారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల అంశాలపై సీఎస్, డీవోలతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో భాగంగా నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్టోరేజ్ పాయింట్‌గా కేటాయించారు. ఫ్లయింగ్ స్కాడ్స్ 2 బృందాలు, సిట్టింగ్ స్కాడ్స్ 3 బృం దాలు(ఆరుగురు సభ్యులు) ఉండనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పోలీస్ కమిషనర్ సునీల్ దత్
మామిళ్లగూడెం, మే 21 : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, పరిసరాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ను అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మంచి గుంపులుగా ఉండొద్దని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని సూచించారు. కేంద్రాల సమీపంలో ఇంటర్నెట్, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీనికి అన్ని వర్గాలు సహకరించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.