భద్రాచలం, జూలై 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో గత మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం మాకు పెట్టద్దంటూ విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. శనివారం ఉదయం సైతం అల్పాహారం కోసం చేసిన 80 కిలోల కిచిడిలో పురుగులు ఎక్కువగా దర్శనమివ్వడంతో 600 మంది విద్యార్థులు తినకుండానే కళాశాలలోని తరగతి గదులకు వెళ్లి నిరసన తెలిపారు.
తాము మూడ్రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారు. భద్రాచలం ఐటీడీఏ ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉన్న ఈ కళాశాలలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. గిరిజన నిరుపేద విద్యార్థినులే కాబట్టి ఏదిపెట్టినా తింటారులే అనే ధీమాతో ఉన్నారా అని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ అధికారి పర్యవేక్షణ ఉన్న కళాశాలలో ఇలాంటి ఘటన ఎలా చోటుచేసుకుంటుందని గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా ప్రిన్సిపాల్ మాత్రం జీసీసీ నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు రావడంతో ఆ బియ్యాన్ని వెనక్కి పంపినట్లు తెలిపారు.
ఐటీడీఏ పీవో వివరణ..
ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ శనివారం అల్పాహారంలో పురుగులు వచ్చినట్లు సిబ్బంది గమనించి కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపారని, ప్రిన్సిపాల్ ఆ అల్పాహారాన్ని నిలిపివేసి తిరిగి మళ్లీ తయారు చేయించారని పేర్కొన్నారు. అప్పటివరకు పిల్లలు ఉపవాసం ఉండకుండా బిస్కెట్లు ఏర్పాటు చేశారన్నారు. తదుపరి డీఎం సివిల్ సప్లయర్స్ నుంచి వచ్చిన 19 క్వింటాళ్ల బియ్యంలో కొన్ని పాతస్టాక్ ఉండటం వల్ల వాటిలో పురుగులు వచ్చినట్లు గుర్తించి వాటిని జీసీసీకి పంపించారన్నారు. వాటిస్థానంలో మంచి బియ్యాన్ని తెప్పించినట్లు తెలిపారు.