పాల్వంచ రూరల్, మార్చి 22 : వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇం కుడు గుంతలు విరివిగా నిర్మించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జగన్నాథపురం రైతు వేదికలో భూగర్భ జలాల వినియోగం, నిర్వహణ, పెంపుదల, రీచార్జి పద్ధతులపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిని వృథాపోనీయకుండా నిల్వ చేసి వివిధ పద్ధతుల ద్వారా మొక్కలు, పంటలకు అందించి పచ్చదనాన్ని పెంచవచ్చన్నారు. ప్రతీ రైతు తమ పొలాల్లో ఫాంపాండ్ , ప్రతీ గ్రామస్తుడు తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. వీటి వల్ల భూగర్బ జలాలు పెరుగుతాయని, నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు నీటి అవసరం ఎంతో ఉందన్నారు. అలాగే రైతులు మునగ సాగుపై ఆసక్తి పెంచుకోవాలని, సాగులో మెళకువలు నేర్చుకుని విస్తారంగా పంట పండించాలన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన నీటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం జగన్నాథపురంలో ఇంకుడు గుంతను తవ్వారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, పంచాయతీ అధికారి చంద్రమౌళి, కొత్వాల శ్రీనివాసరావు, ఇతర అధికారులు తిరుమలేశ్, రమేశ్, వివేక్, విజయభాస్కర్‌రెడ్డి, రేవతి, చంగల్రావు, హరిప్రసాద్, రంగా, రాజ్‌కుమార్, తిరుపతి, శంకర్ పాల్గొన్నారు.