కారేపల్లి, జూన్ 3 : పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సింగరేణి మండలాధ్యక్షుడు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యుడు వాంకుడోత్ గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంకిట్యాతండా గ్రామ పంచాయతీకి 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులో చాలామంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారే పెత్తనాలు చలాయించి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇండ్లను కొంతమంది నాయకులు డబ్బులు తీసుకుని సంపన్నులకు అంటగడుతున్నట్లు ఆరోపించారు. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనను కమిటీ సభ్యుడిగా చేర్చి తనకు తెలియకుండానే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు, క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతానని పేర్కొన్నారు.