భద్రాచలం, నవంబర్ 15: కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం ఆర్టీసీ ఉద్యోగుల బతుకు చిత్రాన్నే పూర్తిగా మార్చివేసింది. ఆర్టీసీ ఉద్యోగులపై మోయలేని పనిభారం పడడంతో వారి ఆరోగ్యం రోజురోజుకూ దెబ్బతింటున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగి బస్సులు మొరాయించడం, టైర్లు పంచర్కావడంతోపాటు అనేక ఓవర్ లోడు సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యమైన మార్గాల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పకపోవడంతో ఉన్న బస్సులనే అదనంగా తిప్పుతుండటంతో ఉద్యోగులపై భారం రోజురోజుకూ పెరిగిపోతున్నది.
హైదరాబాద్, విశాఖపట్నం మార్గాల్లో మూడు మస్టర్ల విధానం తొలగించడంతో పనిభారం పెరిగి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. గడిచిన పదినెలల కాలంలో భద్రాచలం ఆర్టీసీ డిపో పరిధిలో 30 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురికాగా, ఇటీవల ముగ్గురు గుండెపోటుకు గురై ఒకరు మృతిచెందగా.. మరొకరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు విధి నిర్వహణలో భాగంగా భద్రాచలం డిపో నుంచి ఇతర డిపోలకు వెళ్లిన క్రమంలో అకడ విశ్రాంతి గదుల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఆ హామీ అటకెకిందా?
భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన టిమ్స్ డ్రైవర్లు తమకు మూడు మస్టర్లు ఇవ్వాలని, లేనిపక్షంలో అదనపు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టిమ్స్ డ్రైవర్ల ప్రతినిధులతో ఖమ్మం, కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఖమ్మంలో చర్చలు నిర్వహించి, మూడు మస్టర్లు ఇస్తామని, మూడు సర్వీసులు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మరో నాలుగు సర్వీసులు కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్లు ఉద్యోగవర్గాలు పేరొంటున్నాయి. అయితే ఆ హామీ ఇచ్చి రెండునెలలు దాటినా ఇంతవరకూ అమలు కాకపోవడంతో అటకెకినట్లేనని ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా ఉద్యోగులకు అవస్థలు..
ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు సైతం అవస్థలు తప్పడం లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రి 8:30 గంటలకే తమ విధులు పూర్తి చేసి ఇంటికి వెళ్లేలా ఉండేదని ఉద్యోగులు పేరొంటున్నారు. కానీ ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.