తెల్లవారుజామునే మనకు వినిపించేది గ్రామపంచాయతీ వారి చెత్త సేకరణ సమాచారం మైకు. ‘ఆ రండమ్మా రండీ.. చెత్త బండి వచ్చిందమ్మా’ అంటూ విజిల్ వేసి ఇంటి ముందుకొచ్చి పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించి తీసుకెళ్తుంటారు. ఇళ్ల ముందు, రోడ్ల వెంట, మురుగు కాల్వల్లో ఉన్న చెత్తాచెదారం, మృతిచెందిన కుక్కలు కళేబరాలు, కోళ్ల వ్యర్థాలను తీసుకెళ్లి ఊరి బయట ఉన్న డంపింగ్ యార్టుకు తరలించడం వీరి విధి. పనిభారం పెరిగినప్పటికీ ఎంతో ఓపికగా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇంత చాకిరీ చేస్తున్నా తమ కుటుంబ పోషణకు సరిపోయేంత జీతం రావడం లేదని, ఇప్పుడు వచ్చే వేతనంతో బతకడం కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నెలకు రూ. 12 వేల నుంచి రూ.17 వేల వరకు జీతం వచ్చేది. అప్పటివరకు అంతా సజావుగా సాగింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వేతనాల్లో కోత విధించడంతో కార్మికులు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ ఎలా అంటూ దిగులు చెందుతున్నారు. చేసేది లేక జిల్లా కేంద్రంలో ఐదు పంచాయతీల కార్మికులు రోడ్డెక్కారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు.
-భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)
నీళ్లు వదల్లే.. ఎక్కడి చెత్త అక్కడే..
జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఐదు పంచాయతీలకు చెందిన కార్మికులకు వేతనాలు సరిపోకపోవడంతో నిరవధిక దీక్షలకు దిగారు. దీక్షలకు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నిత్యం వెట్టిచాకిరీ చేసే కార్మికులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. ఒకటో తేదీ నుంచి పంచాయతీ కార్మికులు నిరవధిక దీక్షలు చేస్తుండడంతో గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. కనీసం తాగునీటి కోసం పంపునీరు వదలే వారు లేకపోవడంతో ఆయా పంచాయతీల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం నాల్గవ రోజు అధికారులు కార్మికులను బతిమిలాడితే జనం ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని నీళ్లు వదిలి మళ్లీ దీక్షల్లో కూర్చున్నారు.
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మల్టీపర్పస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి పారిశుధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేసున్నది. చదువుకున్న వారికి ఆఫీసు పనులు అప్పగించకుండా చెత్త సేకరించే పనులు అప్పగించడం వల్ల పెద్ద చదువులు చదివినా చెత్త ఎత్తాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకున్నా చెత్త ట్రాక్టర్ నడపాల్సి వస్తున్నదని, జీవో నెంబర్ 51 అమలు చేయడం వల్ల కార్మికులకు సరిపడా వేతనాలు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
పాత వేతనాలే ఇవ్వాలి..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంచి జీతం వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువ జీతం ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాల్సిందే. ఎండా లేదు.. వానా లేదు. మా పని మాదే. ఇంత చేసినా వచ్చే జీతంతో కుటుంబం గడవడం లేదు. రెక్కలు పోను ఎందుకు వెట్టిచాకిరీ చేసి.
-వజ్జ ఆదిలక్ష్మి, పంచాయతీ కార్మికురాలు, సంజయ్‌నగర్, లక్ష్మీదేవిపల్లి
ఎలాంటి మురుగైనా తియ్యాల్సిందే..
సామాన్యంగా మురుగు వద్దకు ఎవరూ వెళ్లరు. ముక్కు మూసుకొని వెళ్లినా కడుపులో తెములుతుంది. ప్రాణం పోయినంత పని అవుతుంది. అయినా మా మీద ప్రభుత్వం కనికరం చూపడం లేదు. జీతాల చెల్లింపులో వివక్ష చూపుతున్నది. ఇంటికి వెళ్లి అన్నం తినాలంటే చేతులు అన్నంలో పెట్టలేని పరిస్థితి మాది.
-పాయం సతీశ్, అశోక్‌నగర్ జీపీ, లక్ష్మీదేవిపల్లి మండలం