చింతకాని, మే 11:ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతుల నుంచి ధాన్యం, మక్కల కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. చింతకానిలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత యాసంగిలో పండించిన ధాన్యాన్ని, మక్కలను రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాల వల్లనే సాగు భూమి పెరిగి అధిక దిగుబడులు వస్తున్నాయని అన్నారు. ఇంత మొత్తంలో దిగుబడులు వచ్చిన దాఖలాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేవని గుర్తుచేశారు.
ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలియని వారు చేసే పుకార్లను రైతులెవరూ నమ్మవద్దని సూచించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి రైతూ ప్రభుత్వ మద్దతు ధరకే తమ పంటలను అమ్ముకోవాలని కోరారు. సొసైటీల్లో విధిగా కాటా మిషన్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు ఉంచాలని అధికారులను ఆదేశించారు. జడ్పీ, డీసీసీబీ,. టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నల్లమల వెంకటేశ్వర్లు, బొమ్మెర రామ్మూర్తి, కొండపల్లి శేఖర్‌రెడ్డి, పెంట్యాల పుల్లయ్య, పీటీ కిశోర్, పూర్ణయ్య, కిలారు మనోహర్, మంకెన రమేశ్, గురజాల హనుమంతరావు, తాతా ప్రసాద్, గడ్డం శ్రీనివాసరావు, బండి సుభద్ర, బొడ్డు వెంకట్రామయ్య, నన్నక కోట య్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
దృష్టిలోపంపై అశ్రద్ధ వద్దు
దృష్టిలోపంపై ఎవరూ అశ్రద్ధ వహించవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ‘సర్వేంద్రియాం నయనం ప్రధానం’ కాబట్టే సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మొదటి విడత విజయవంతం కావడంతో ఈ ఏడాది జనవరి 18న రెండో విడతనూ మొదలుపెట్టారని అన్నారు. వంద రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. వైద్యులు ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు చేస్తారని, దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సలు అందిస్తారని, రీడింగ్, ప్రిస్రిప్షన్ కళ్లజోళ్లను పంపిణీ చేస్తారని వివరించారు. ఖమ్మం 58వ డివిజన్ రాపర్తినగర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా 55 బృందాలు కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్నాయని అన్నారు ఎకడికకడ కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కంటి పరీక్షలు కొనసాగిస్తున్నాయని అన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా, ఏఎంసీ చైర్మన్లు బచ్చు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాంబాబు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.