ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24 : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున కోలాటం, డప్పు కళాకారులను రప్పించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రం నుంచి పటాకులు, రాకెట్లను తెప్పించి ఊరేగింపులో వాటిని పేల్చారు. సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతున్న సమయంలో రెండు ఇండ్ల గృహ ప్రవేశం అనంతరం మూడవ గృహ ప్రవేశం జరుగుతున్న సమయంలో టాటా ఏస్ నుండి రాకెట్లను వదులుతున్న యువకుల గురితప్పడంతో తిరిగి రాకెట్ అదే వాహనంలోకి వచ్చి పడింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగడంతో జనాలు పరుగులు తీశారు. నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామం నుండి కోలాటం వేసేందుకు వచ్చిన యువతి పొట్ట పెంజర శివానికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ప్రథమ చికిత్స చేశారు. అదే ప్రమాదంలో గాయాలు ఎక్కువ కావడంతో తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ కు చెందిన బాలు అనే కానిస్టేబుల్ను ఖమ్మం ప్రైవేట్ వైద్యశాలకు తరలించినట్లు తెలుస్తుంది.
గృహ ప్రవేశాలు అనంతరం వివిధ శంకుస్థాపనల తర్వాత ఆరెంపుల గ్రామ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉపన్యాసం ముగించే సమయంలో ముందు వరుసలో కూర్చున్న అదే గ్రామానికి చెందిన దేవయాని అనే మహిళ ఒక్కసారిగా సొమ్మసిల్లి సభా ప్రాంగణంలోనే మూర్చిల్లి కింద పడిపోయింది. దీంతో స్థానికులు, అక్కడే విధుల్లో ఉన్న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్ తన సిబ్బందితో కలిసి మహిళను హుటాహుటిన ఖమ్మంకు పోలీస్ వాహనంలో తరలించారు. అనంతరం మంత్రి పొంగులేటి యధావిధిగా తన ఉపన్యాసం చేసి ఇందిరమ్మ గృహ ఇంటి లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి పర్యటన ముగించుకుని కొత్తగూడం జిల్లాకు బయల్దేరి వెళ్లారు.