– అందుబాటులో ఉండని వైద్యులు
– ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఆరోపణలు
– మంత్రి హెచ్చరించిన మారని తీరు
తిరుమలాయపాలెం, జూన్13 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు ప్రభుత్వ విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ పట్ల శ్రద్ధ చూపుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం నుండి ఆస్పత్రికి కార్లలో విజిటర్లుగా మారారు. ఆస్పత్రిలో ఏదో కొద్ది సమయం గడిపి మళ్లీ ఖమ్మం వెళ్లి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. డాక్టర్లు అందుబాటులో లేక రోగులకు వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి.
డాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే ఆస్పత్రిలో వైద్య సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. పేరుకు పెద్ద ఆస్పత్రి కానీ ఇక్కడ ఎక్స్రే, స్కానింగ్ లాంటి సౌకర్యాలు కూడా లేవు. రోగ నిర్ధారణ పరీక్షలు కూడా సక్రమంగా లేవు. దీంతో అరకొర సేవలతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిని పలుమార్లు సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైద్యులను హెచ్చరించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.