మణుగూరు టౌన్, అక్టోబర్ 3: దేశంలోకెల్లా తెలంగాణలోనే క్రీడలకు, క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని, ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. కిట్లు అందించి మరీ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని క్రీడాకారులకు ప్రభుత్వం పంపిన క్రీడా కిట్లను మణుగూరులోని కిన్నెర కల్యాణ మండపంలో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. తొలుత వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తరువాత అదే వేదికపై క్రికెట్, వాలీబాల్ ఆడి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేగా మాట్లాడుతూ.. ఏజెన్సీలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ క్రీడా పాంగణాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 750 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే.. కేవలం పినపాక నియోజకవర్గంలోనే 202 క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడాప్రాంగణాలు, కిట్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలంటే తనకెంతో ఇష్టమని, క్రీడల విషయంలో క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఈ ప్రాంతానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. మణుగూరు మండలంలో రామానుజవరంలో పదెకరాల భూమిని క్రీడాప్రాంగణానికి కేటాయించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ 202 క్రీడా ప్రాంగణాలకు మొదటి హామీ కింద రూ.లక్ష చొప్పున సీడీపీ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డీవైఎస్వో పరంధామరెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.