వ్యవసాయం చేసే ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. చదువుతున్న పిల్లలు, వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య.. ఇక సాగు సాగించేవారు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి. ఆదుకునేవారు లేక.. చేసిన అప్పులు తీర్చలేక ఉన్న సాగు భూమిని అరకొర రేటుకు అమ్మి ఆ కుటుంబం కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి. ఇవన్నీ గత ప్రభుత్వాల హయాంలో బాధిత రైతు కుటుంబాలు చవిచూసినవే. అనుభవించినవే. ఇక అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కుటుంబానికి రావొద్దని, రైతు మరణించిన ఆ కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ రైతుబీమాను తెచ్చారు. రైతు తరఫున ప్రీమియం ప్రభుత్వమే చెల్ల్లించే విధంగా రూపకల్పన చేశారు. బీమా సొమ్ము రూ.5 లక్షలు ఆ కుటుంబ నామినీ ఖాతాలో వారం రోజుల్లో పడేలా చేశారు. ఇంతటి సాయం చేసిన సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువమంటున్నాయి దుమ్ముగూడెం మండలంలోని బాధిత రైతు కుటుంబాలు.
– దుమ్ముగూడెం, సెప్టెంబర్ 24
దుమ్ముగూడెం, సెప్టెంబర్ 24 : ఏళ్లుగా సాగునే నమ్ముకున్న రైతులు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకునే అన్నదాతలు. ఎకరాలకొద్దీ పంట భూములున్నా సాగుకు నీరందక ఎడారులుగా మారాయి. కొన్నిచోట్ల బీడు భూములుగా మారి నోరెళ్లబెట్టాయి. బావులు, బోర్ల కింద ఉన్న భూముల్లో పంటలు పండించు కుందామంటే వేళకు కరెంటు లేక వేసిన పొలాలు ఎండిపోయాయి. పంట పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక.. ఉన్న ఊరిని వదిలి పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసబాట పట్టారు దుమ్ముగూడెం మండలంలోని రైతులు. ఉమ్మడి పాలనలో రైతులు ఇన్ని ఇబ్బందులుపడినా పాలకులు మిన్నకుండిపోయారే తప్ప వ్యవసాయరంగం, రైతుల బాగోగుల గురించి ఆలోచించే వారు కరువయ్యారు. ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం లభించలేదు. రైతులు బాగుపడలేదు.
వ్యవసాయాన్నే వదిలేసి ఉపాధి మార్గాలను ఎంచుకున్న రైతులు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే తడవుగా సీఎం కేసీఎం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. రైతులు రెండు పంటలు పండించుకునే విధంగా సాగునీటి వనరులను అభివృద్ధి చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడికతీసి.. తూములను మరమ్మతు చేసి.. నీటి నిల్వ పెంచడంతోపాటు చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందేలా చేశారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, రైతులు పండించిన ధాన్యం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ రైతుల పక్షాన నిలిచారు సీఎం కేసీఆర్.
రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబిడ్డగా అడగకుండానే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. వ్యవసాయం చేసే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో రైతుబీమాతో భరోసా కల్పించారు. రైతుకు సంబంధించిన బీమా ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే నామినీగా ఉన్న రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును వారం రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం ఎంతో మంది రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచింది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చేసుకునే రైతు అకస్మాత్తుగా మరణిస్తే ఆ రైతు కుటుంబానికి అప్పులే మిగిలేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకున్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. మరణించిన రైతు కుటుంబానికి రైతుబీమా పథకం ఆర్థిక భరోసా కల్పించింది. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాలో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ కావడం రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచే అంశం. ఈ విషయంలో రైతులందరూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– మట్టా వెంకటేశ్వరరావు, జిల్లా రైతు సమితి సభ్యుడు
తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుం టూ.. ఊరిలోనే కూలీ పనులు చేసుకుంటున్నాం. మా అమ్మ వల్లెపోగు రాములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. అమ్మకు సంబంధించిన భూమికి నామినీగా నేను ఉండడంతో మరణించిన వారం రోజుల్లోనే నా ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. దీంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడింది. ఇప్పుడు కుటుంబమంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. కేసీఆర్ లాంటి సీఎం మళ్లీ రావాలి. – వల్లెపోగు రమేశ్, రైతు నామినీ, రేగుబల్లి
దుమ్ముగూడెం మండలంలోని పలు గ్రామాల్లో 296 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. ఆయా రైతులకు సంబంధించిన నామినీల అకౌంట్లలో రైతుబీమా సొమ్ము రూ.5 లక్షల చొప్పున రూ.14.80 కోట్లు జమ అయ్యాయి. రైతు మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పంటల కోసం గతంలో చేసిన అప్పులు తీర్చ డం కోసం ఆ డబ్బులను వినియోగిస్తున్నారు. 2018లో మండలంలో 40 మంది రైతులు మృతిచెందగా.. రూ.2 కోట్లు, 2019లో 40 మంది రైతులు మృతిచెందగా.. రూ.2 కోట్లు, 2020లో 69 మంది రైతులకు రూ.3.45 కోట్లు, 2021లో 91 మంది రైతులకు రూ.4.55 కోట్లు, 2022లో 56 మంది రైతులకు రూ.2.80 కోట్లు వారి నామినీల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది.