కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 8 : ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
ఈ పథకాన్ని మొట్టమొదటిసారిగా సింగరేణిలో ప్రారంభించడానికి సహకారం అందించిన బ్యాంకుల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా సింగరేణి ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, పొరుగు సేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందించడం సంతోషకరమన్నారు. ఇప్పటివరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 34 మంది కార్మికులకు దాదాపు రూ.30 కోట్ల సొమ్మును బ్యాంకుల ద్వారా అందించామని గుర్తు చేశారు. ఒప్పంద కార్మికులకు కనీసం రూ.50 లక్షలు ప్రమాద బీమా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు సహజ మరణం పొందితే కనీసం రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ పోట్రు గౌతమ్, జీఎం టి.శ్రీనివాస్, ఏజీఎం చక్రవర్తి, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.