పినపాక, నవంబర్ 8 : విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని, ఎంచుకున్న ఆటలో ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. మండలంలోని ఏడూళ్ళబయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం మండలానికి గర్వకారణమన్నారు.
క్రీడాకారులు చదువుతోపాటు ఆటలపై దృష్టి సారించాలని, వ్యాయామ ఉపాధ్యాయులు చెప్పే మెళకువలు నేర్చుకొని ఆటలపై పట్టు సాధించాలన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా మళ్లీ సాధన చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలన్నారు.
తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి 10 బాలుర, 10 బాలికల జట్లు పాల్గొనగా.. మొదటి రోజు బాలుర విభాగంలో వరంగల్-నల్లగొండ, కరీంనగర్-ఖమ్మం, వరంగల్-నిజామాబాద్, నల్లగొండ-ఖమ్మం, బాలికల విభాగంలో ఖమ్మం-హైదరాబాద్, వరంగల్-నల్లగొండ, ఖమ్మం-రంగారెడ్డి, హైదరాబాద్-వరంగల్ జట్లు తలపడ్డాయి. సోమవారం ఫైనల్ కబడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. కార్యక్రమంలో బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, డీఈవో నాగలక్ష్మి, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో సంకీర్త్, ఎంపీవో వెంకటేశ్వరరావు, గ్రామస్తులు సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.