Feet Swelling | పాదాల వాపులు అనేవి సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. గర్భిణీలకు ఈ సమస్య సహజంగానే ఉంటుంది. ఇతరులకు ఈ సమస్య వచ్చేందుకు అనేక అనారోగ్య సమస్యలు కారణం అవుతుంటాయి. శరీరంలో ద్రవాలు అధికంగా చేరడం వల్ల పాదాల వాపులు వస్తాయి. కిడ్నీ సమస్య ఉన్నా, కిడ్నీలు ఫెయిల్ అయినా, దీర్ఘకాలికంగా మందులను వాడుతున్నా, గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉన్నా, డయాబెటిస్ లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారిలో పాదాల వాపులు తరచూ వస్తుంటాయి. అయితే ఇది తీవ్రమైన అనారోగ్య సమస్య కాకపోయినా నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. పాదాల వాపులను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. పాదాల వాపులకు సాధారణంగా వైద్యులు మందులను ఇస్తారు. అయితే పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
ఒక బకెట్లో సగం వరకు గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా హిమాలయన్ సాల్ట్ వేసి కలపాలి. అనంతరం ఆ నీళ్లలో కాళ్లను ఉంచాలి. 15 నిమిషాలు ఉన్నాక కాళ్లను తీసేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాల్సి ఉంటుంది. దీంతో పాదాల వాపుల నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే ఈ సమస్య నుంచి బయట పడేసేందుకు గాను గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒక బకెట్ గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొన్ని చుక్కల గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్‌ను వేసి కలపాలి. అనంతరం ఆ నీళ్లలో కాళ్లను ఉంచాలి. 15 నిమిషాలు అయ్యాక కాళ్లను తీసేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఈ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కనుక పాదాల వాపులను సులభంగా తగ్గించుకోవచ్చు.
శరీరంలో లవణాల మోతాదు మరీ అధికంగా ఉన్నా కూడా పాదాల వాపులు వస్తాయి. కనుక లవణాల శాతాన్ని తక్కువ చేసేందుకు యత్నించాలి. ఇందుకు గాను నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. నీళ్లను అధికంగా తాగకపోయినా ఈ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ నీళ్లను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. పాదాల వాపులు తగ్గుతాయి. అలాగే ఈ సమస్య నుంచి బయట పడేందుకు గాను నిమ్మరసం కలిపిన నీళ్లను తాగుతున్నా కూడా ఉపశమనం లభిస్తుంది. రోజూ ఒక గ్లాస్ కీరదోస జ్యూస్‌ను కూడా తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. పాదాల వాపులు తగ్గిపోతాయి. పాదాల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అలాగే అల్లం నీళ్లను లేదా అల్లం రసాన్ని తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అన్ని రకాల వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. కనుక ఈ సమస్య ఉన్నవారికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. రోజూ దీన్ని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
పాదాల వాపులు ఉన్నవారు పుచ్చకాయలను తింటుండాలి. ఇందులో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. పుచ్చకాయలను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాయల్లో సుమారుగా 92 శాతం మేర నీరు ఉంటుంది. అందువల్ల ఈ కాయలను తింటే మూత్రం ధారాళంగా వస్తుంది. దీని వల్ల శరీరంలో అధికంగా ఉండే ద్రవాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. పాదాల వాపులు, నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉంటారు. ఇక పాదాల వాపులను తగ్గించేందుకు గాను ధనియాల నీళ్లు కూడా ఎంతగానో పనిచేస్తాయి. ధనియాలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ధనియాలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే ఫలితం ఉంటుంది. పాదాల వాపులు, నొప్పులు సులభంగా తగ్గిపోతాయి. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.