భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై మహిళలు ప్రభావం చూపనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ‘ఆమె’ తీర్పు ప్రధానంకానుంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ పూర్తి కాగా రేపు ఆదివారం రెండోవిడత పోలింగ్ జరగనుంది. మూడో విడత ఈ నెల 17వ తేదీతో పంచాయతీ ఎన్నికల పోరు ముగియనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,69,048 మంది ఉండగా వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు.
– అశ్వారావుపేట, డిసెంబర్ 12
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. ప్రతి మండలంలోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా అభ్యర్థుల విజయం మహిళా ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉంది. వారు ఎటు మొగ్గు చూపితే ఆ వైపు అభ్యర్థులకు విజయం ఖాయంకానుంది. జిల్లాలో మొత్తం 22 మండలాల్లో 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికోసం అధికారులు 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం కాగా మొదటివిడతలో 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డులకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ పూర్తి అయ్యింది.
రెండోవిడతలో అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట, చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లో 156 గ్రామ పంచాయతీలు, 1,392 వార్డులకు 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక మిలిగిన ఆళ్ళపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని 156 గ్రామ పంచాయతీలు, 1,340 వార్డులకు ఈనెల 17వ తేదీన పోలింగ్‌తో పంచాయతీల ఎన్నికల పోరు ముగియనుంది. జిల్లాలో 6,69,048 మంది ఓటర్లలో పురుషులు 3,25,045, మహిళలు 3,43,979, ఇతరులు 24మంది ఉన్నారు. మొదటి విడత మినహా మిగిలిన రెండు విడతల్లో సుమారు 4లక్షల మందికిపైగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. పురుషులతో పోల్చితే అన్ని మండలాల్లోనూ 18,934 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

ఎన్నికల బరిలో సగం మంది మహిళలు
ఇదిలాఉంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మంది మహిళలు బరిలో నిలిచారు. అభ్యర్థులంతా మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందకు ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి ఆశీస్సులు ఉంటే విజయం సులభమవుతుందని భావించిన రాజకీయ పార్టీలు సైతం మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఎక్కడచూసినా మహిళా ఓటర్ల ప్రాముఖ్యత కనిపిస్తుంది. వీరి ఎటు మొగ్గు చూపితే అటువైపు విజయం ఖాయమన్న అభిప్రాయాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా మహిళల ఆశీస్సులు తీసుకోవటానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
