చుంచుపల్లి, జూలై 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనదారులను మళ్లీ బాదుడు షురూ చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్నెస్ చేయించే సమయంలో ఆయా వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టికర్లు(రేడియం) అంటించడం తప్పనిసరి. వాహనాల భద్రత విషయంలో ఈ స్టిక్లర్లు ఉండాల్సిందే. అయితే రవాణాశాఖ ఆ పనిని రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో వారు వాహనదారుల నుంచి దండుకుంటున్నారు. బయట మార్కెట్‌తో పోలిస్తే అధిక ధరలకు స్టిక్కర్లను అంటగడుతున్నారు. దీంతో అదనపు భారం పడుతుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 60కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల అమలు ప్రక్రియ జరుగుతోంది. అయితే ఈ జీవో అమలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మూడునెలల క్రితం లారీ యజమానుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. రిఫ్లెక్టివ్ స్టికర్ల అమలుపై మూడునెలలపాటు సడలింపు లభించినట్లు ఆ సంఘాల నాయకులు తెలిపారు. ఆ సడలింపు గడువు ముగియడంతో రవాణా శాఖ కార్యాలయాల్లో మళ్లీ రిఫ్లెక్టివ్ స్టికర్ల అమలు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం రవాణాశాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే వాహనాలకు రెండు సంవత్సరాలకొకసారి రిఫ్లెక్టివ్ స్టికర్లు తప్పనిసరి చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. దీంతో అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాహన రకాన్ని బట్టి రిఫ్లెక్టివ్ స్టికర్ల కోసం రూ.150 నుంచి రూ.2,900 వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారీ సరుకు రవాణా వాహనాలు, ట్రకులు, బస్సులు, 3,000 కిలోలకు పైగా సామర్థ్యం కలిగిన వాహనాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, టోల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, నిర్వహణ ఖర్చులతో ఇబ్బందిపడుతున్న వాహనదారులపై రవాణాశాఖ మరింత భారం మోపుతోందని లారీ యజమానులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నప్పటికీ ధరల నియంత్రణ, అమలు విధానంలో పారదర్శకత, వాహనదారులపై పడే ఆర్థిక భారం అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిఫ్లెక్టివ్ స్టికర్ల అమలు వల్ల వాహనదారులపై అదనపు భారం పడుతుండడంతో చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో-60ను వెంటనే రద్దు చేయాలి. రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని తీసివేయాలి. క్యూర్ కోడ్ నిబంధనతో వాహనదారులపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేటు కంపెనీల దోపిడీకి రవాణాశాఖ ఊతమివ్వడం దుర్మార్గం. ఈ నిబంధనలు ఆటోడ్రైవర్లను, వాహన యజమానులను నిలువునా ముంచుతున్నాయి. టేపుల పేరుతో రేట్లు పెంచి చేస్తున్న దోపిడీని తక్షణమే ఆపాలి. చట్టంలో లేని నిబంధనలను గుట్టుగా అమలు చేయడంపై ఉద్యమిస్తాం.
– కంచర్ల జమలయ్య, ఏఐటీయూసీ ఆటోవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు