బూర్గంపహాడ్, మే 20: విధి నిర్వహణలో పద్ధతి మార్చుకోకుంటే బదిలీ చేస్తాం అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న బూర్గంపహాడ్ సీహెచ్సీ మ్యూజియంలా మారిందని, ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎవరూ సమయపాలన పాటించరు అంటూ అసహనం వ్యక్తం చేశారు. డీసీహెచ్ఎస్ రవిబాబుతో కలిసి మంగళవారం బూర్గంపహాడ్ మండల పర్యటనకు వచ్చిన ఆయన కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల సంఖ్య పెరుగుతున్నా, ప్రసవాల సంఖ్య తగ్గిందని, ఆసుపత్రిలో సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది లేకపోతే రోగులు ఎలా వస్తారని మండిపడ్డారు.
అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇక్కడ మీ పనితీరుతో గుండు సున్నాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరు నాటికి కనీసం 20 ప్రసవాలైనా జరగాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రి పునర్నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ఎవరూ ఉపయోగించుకోవడం లేదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమ్రోకసీ నాయకుడు పున్నంచంద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రహరీలో దారి వదిలి వాటిని ప్రజలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ దృష్టికి తాగునీరు, టాయిలెట్ల సమస్యను గురుకుల అధికారులు తీసుకెళ్లారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో జమలారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు.