మామిళ్లగూడెం, నవంబర్ 17: ఖమ్మంలో అక్రమ ఆయుధాల ఘటన కలకలం రేకెత్తిస్తున్నది. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద పిస్టళ్లు లభించాయి. ఖమ్మం కస్బాబజార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు, బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెంది ప్రస్తుతం నగరంలోని ఖానాపురంలో నివాసముంటున్న మరో వ్యక్తి ముఠాగా ఏర్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉండగా మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులు అక్రమ వసూళ్లకు పాల్పడడంతోపాటు రియల్ దందాలో బడా వ్యాపారులు, ఇతర వ్యాపారులకు ఆయుధాలు సరఫరా చేశారా? లేక వీరే వినియోగించి బెదిరింపులకు పాల్పడుతూ దందాలు కొనసాగిస్తున్నారా? అనేది పోలీసుల విచారణలో తేలనున్నది. నిందితులపై గార్ల, బయ్యారం, మరిపెడ, మహబూబాబాద్, ఖమ్మం త్రీటౌన్, వన్‌టౌన్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదై ఉన్నాయి.
అక్రమ ఆయుధాలు కలిగి దందాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మం త్రీ టౌన్ పీఎస్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ప్రకాశ్‌నగర్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు త్రీటౌన్ పోలీసులను వాహనం వదిలిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నింరు. వెంటనే త్రీటౌన్ పోలీసులు వారిని పట్టుకొని విచారణ చేపట్టారు. వారు ఖమ్మం కస్బాబజార్కు చెందిన మహ్మద్ అప్సర్, ఖానాపురానికి చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లుగా తెలింది. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా పిస్టళ్లు-3, మాగ్జిన్లు-4, బుల్లెట్లు-17, ఒక బైకు లభించాయి.
వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారితోపాటు మహ్మద్ రియాజ్ అనే వ్యక్తి ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. వీరు కొన్నేళ్లుగా ముఠాగా ఏర్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయారు. అప్పుల పాలు కావడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మావోయిస్టుల పేరుతో తుపాకులు చూపించి వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. అదే అనుభవంతో వీరు ముగ్గురు ఆయుధాల కోసం బీహార్‌కు వెళ్లి అక్కడ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి తిరిగి వచ్చారు.
11 నెలల కిత్రం వీరి ముఠా సభ్యుడైన మహ్మద్ రియాజ్‌ను బీహార్‌కు పంపించి పిస్టళ్లు-3, మాగ్జిన్లు-4, బుల్లెట్లు-17ను తెప్పించి దందాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అప్సర్, గుండమల్ల వెంకటేశ్వర్లు కలిసి ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారుల వద్దకు వెళ్లి మావోయిస్టులమని బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో మహ్మద్ అప్సర్పైన 2016లో గార్ల, 2013లో మరిపెడ, మహబుబాబాద్ టౌన్ పీఎస్‌లలో అక్రమ ఆయుధాలు, వసూళ్ల కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వెంకటేశ్వర్లుపై 2001లో ఖమ్మం త్రీటౌన్, 2007లో గార్ల, మహబుబాబాద్ టౌన్ పీఎస్‌లలో అక్రమ ఆయుధాలు, ఎక్స్టోరేషన్ కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న మరో నిందితుడు రియాజ్‌పై 2013లో ఖమ్మం వన్‌టౌన్ పీఎస్లోఅక్రమ ఆయుధాల కేసులు నమోదయ్యాయి. కాగా, నిందితులను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు విచారణలో తెలుతాయని సీపీ తెలిపారు. ఏసీపీ రమణమూర్తి, సీఐ రమేష్, ఎస్ఐ నాగేంద్రబాబు పాల్గొన్నారు.