భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక క్వారీలు మూతపడి ఆరు నెలలు గడుస్తున్నా రవాణా మాత్రం జోరుగా నడుస్తున్నది. స్టాక్ యార్డుల పేరుతో యథేచ్ఛగా అక్రమ తోలకాలు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి అనేక ప్రాంతాలతోపాటు హైదరాబాద్ మహానగరం వరకు నిరంతరం ఇసుక రవాణా కొనసాగుతున్నది. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. అప్పుడప్పుడూ ఇసుక లారీలను పట్టుకుంటున్నప్పటికీ ఆ వివరాలు బయటికి తెలియనీయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి పదినెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఇసుక ధరలు పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మణుగూరు, బూర్గంపహాడ్, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఇసుక క్వారీలు ఉన్నాయి. మణుగూరులో రెండు, దుమ్ముగూడెంలో రెండు, భద్రాచలంలో ఒకటి, బూర్గంపహాడ్‌లో రెండు సొసైటీలు నడుస్తుండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ మూతపడ్డాయి. ఇప్పటివరకు ఆయా క్వారీలను సొసైటీలకు అప్పగించకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. క్వారీలకే కాకుండా ‘మన ఇసుక వాహనాల’కు కూడా అనుమతులు ఇవ్వకపోవడం సర్వత్రా అనుమానాలకు తావిస్తున్నది. ఇసుక కొరత సృష్టిస్తే డిమాండ్ పెరిగి అక్రమార్కులకు మేలు చేకూరుతుందన్న ఉద్దేశంతో అధికారులు కాకి కబుర్లు చెబుతూ ఇసుక సొసైటీలను తెరవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి బాహాటంగా వినిపిస్తున్నాయి. ‘అసలు స్టాక్ యార్డుల్లో ఎంత ఇసుక ఉంది? వాటికి పర్మిషన్ ఉందా?’ అనేది కూడా అధికారులకు తెలియకపోవడం విశేషం. చర్ల ప్రాంతంలో స్టాక్ యార్డు లేకుండానే అక్కడి నుంచి ఇసుక తరలిపోతుండడం గమనార్హం. బూర్గంపహాడ్‌లో కూడా స్టాక్ యార్డు లేకుండానే లారీల ద్వారా ఇసుక అక్రమంగా తరలిపోతున్నది.
కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా ఉండి అధికార పార్టీ నేతల అండతో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. ‘దొరికితే దొంగ.. లేదంటే దొర’ అన్నట్లు అన్ని చెక్‌పోస్టులకు మామూళ్లు ఇచ్చి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఆకస్మిక తనిఖీల్లో దొరికితే జరిమానా కట్టడం.. లేకుంటే రూ.లక్షలు సంపాదించడం అక్రమార్కులకు నిత్యకృత్యమైంది. ఆర్టీఏ అధికారులు కూడా చూసీచూడనట్లుగా ఉండడంతో చెక్‌పోస్టులు దాటి లారీలు వెళ్తున్నాయి. ఇటీవల ఆంధ్రా నుంచి ఇసుక హైదరాబాద్ తరలిస్తుండగా మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. కానీ ఆ లారీలపై సీఎం ఫొటో ఉండడంతో విషయం గోప్యంగా ఉంచారు. ఇదే తరహాలో తాజాగా మరో ఆరు లారీలను ఓవర్‌లోడ్ పేరుతో మైనింగ్ అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. కానీ ‘ఆ లారీలు ఎవరివి? ఎక్కడకు ఇసుక తరలిస్తున్నారు?’ అనే గుట్టువిప్పలేదు. కేవలం జరిమానా విధించడం తప్ప దాని వెనుక ఎవరిహస్తం ఉందో చెప్పకపోవడం గమనార్హం.
జిల్లాలో మణుగూరు, భద్రాచలంలో మాత్రమే మొత్తం మూడు ఇసుక స్టాక్ యార్డులు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాను అనేకసార్లు అడ్డుకొని కేసులు నమోదు చేశాం. చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాల్లో ఇసుక క్వారీలు ఇంకా తెరవలేదు. సొసైటీలకు అనుమతి వస్తే నడుస్తాయి. భద్రాచలం వద్ద పట్టుకున్న లారీలకు జరిమానా విధించాం. గతంలో సారపాకలో కూడా ఆరు లారీలను పట్టుకున్నాం.