Godavari River | భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) ; భద్రాద్రి జిల్లాలోని గోదావరి నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో జోరుగా అక్రమ వ్యాపార దందా సాగుతున్నది. అధికారుల ఉదాసీనతతో ఇసుక లారీలు చెక్‌పోస్టులను దాటి హైదరాబాద్ సిటీ వరకు వెళ్తున్నాయి. జిల్లావ్యాప్తంగా చర్ల మండలంలో ఒకేఒక్క ఇసుక రీచ్‌కు అనుమతి ఉండడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. జిల్లాలోని గోదావరిపై ఉన్న అన్ని ఇసుక రీచ్‌లు, ఇసుక వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇసుక దందా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో గండిపడుతున్నప్పటికీ ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.
క్వారీల్లేవు.. ఇసుక పుష్కలం
అసలు ఇసుక తవ్వకాలు చేసే క్వారీలే లేవు.. కానీ ఇసుక మాత్రం పుష్కలంగా దొరుకుతున్నది. అయితే సామాన్యులకు మాత్రం ధరలు అందుబాటులో లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసుకునేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల అండతో ఇసుక లారీలు హైదరాబాద్ సిటీ వరకు తరలిపోతున్నాయి. గత ఎనిమిది నెలల క్రితం ఆంధ్రా ఇసుక హైదరాబాద్ తరలిస్తుండగా.. మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. అదే తరహాలో ఇటీవల తాజాగా మరో ఆరు లారీలను ఓవర్‌లోడ్ పేరుతో మైనింగ్ అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. కానీ.. ఎవరి లారీలు, ఎవరి కోసం ఇసుక తరలిస్తున్నారు అనేది అధికారులు గుట్టువిప్పలేదు. కేవలం జరిమానా విధించడం తప్ప ఎవరి హస్తం ఉందో చెప్పకపోవడం కొసమెరుపు.
కాంగ్రెస్ సర్కార్ ఇసుకకు అక్రమ రవాణాకు గేట్లు బార్లా తీసింది. భద్రాద్రి జిల్లాలో జరిగే ఇసుక దందాకు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో చోటా, బడా నాయకులు పాత్రధారులుగా ఉండడంతో ఇసుక వ్యాపారం మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా చర్ల మండలంలో ఒకటే ఇసుక రీచ్ ఉన్నప్పటికీ జిల్లా మొత్తానికి ఇసుక సరఫరా యథేచ్ఛగా సాగుతున్నది. దీంతో దొడ్డిదారి రవాణాకు అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇసుక వాహనాలు కూడా లేవు..
మన ఊరు-మన ఇసుక వాహనాలు ఉంటే నిర్మాణదారులకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ.. ప్రభుత్వం ఇసుక వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం లేదు. కొరత సృష్టిస్తే అక్రమంగా రవాణా చేసుకొని డబ్బులు సంపాదించవచ్చని నాయకులే ఇసుక కొరతను సృష్టిస్తున్నారు. జిల్లాలో గతంలో మణుగూరులో 3, పినపాకలో 4, చర్ల 3, దుమ్ముగూడెంలో 2, భద్రాచలం 1, బూర్గంపాడులో 2 రీచ్‌లు ఉండేవి. కానీ.. ఇప్పుడు చర్లలో మాత్రమే ఒకటి అధికారికంగా నడుస్తున్నది. మరో సొసైటీకి అనుమతివచ్చినా ఇంకా ప్రారంభంకాలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇసుకదందా జోరుగా నడుస్తున్నది. సారపాక ప్రాంతమైతే అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అడ్డొస్తే ప్రభుత్వ సిబ్బందిని బెదిరిస్తున్న సందర్భాలున్నాయి. పోలీసులు సైతం అంటీముట్టనట్లుగా ఉండడంతో దందా మరింత విచ్చలవిడి అయ్యింది.
దొరికితే దొంగ.. లేకుంటే దొర..
బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉండి అధికార పార్టీ అండతో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. దొరికితే దొంగ.. లేకుంటే దొర అన్నట్లు అన్ని చెక్‌పోస్టులకు మామూళ్లు ఇచ్చి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తే దొరికితే జరిమానా కట్టడం.. లేకుంటే రూ.లక్షలకు విక్రయాలు చేయడం వారివంతు. ఇలాంటి ఘటనలు భద్రాద్రి జిల్లాలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా ఉండడంతో చెక్‌పోస్టులు దాటి హైదరాబాద్ సిటీకి వెళ్లిపోతున్నాయి.
ఇసుక వాహనాలు ఉండాలి
ఇసుకకు డిమాండ్ బాగా పెరుగుతున్నది. వాగులో ఇసుక కూడా ట్రాక్టర్ రూ.4 వేల చొప్పున అమ్ముతున్నారు. గోదావరి ఇసుక అయితే సామాన్యులు కొనలేని పరిస్థితి. సొసైటీలు పేరుకే.. పెత్తనమంతా బడా బాబులదే. అందుకే నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.
-చారుగుండ్ల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఉద్యోగి, పాల్వంచ
దొంగలకే అనుమతి ఇస్తున్నారు..
పేదవాడు ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అర్ధరాత్రి తోలకానికి వేలల్లో డబ్బులు అడుగుతున్నారు. ఆ సమయంలో ఏ వాహనం అడ్డువచ్చినా ఢీకొట్టి వెళ్తున్నారు. ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. లోకల్లో వాగులు ఉన్నప్పటికీ అనుమతులు లేకపోవడంతో ఉపయోగం లేకుండాపోతున్నది.
-కొండా రాజు, తాపీమేస్త్రీ, రుద్రంపూర్, కొత్తగూడెం
జిల్లాలో ఒక్కటే రీచ్..
జిల్లాలో ఒకే ఒకచోట ఇసుక రీచ్ చర్ల మండలం వీరాపురంలో ఉంది. ఇంకోదానికి అనుమతి వచ్చి ఉంది.. త్వరలో ప్రారంభమవుతుంది. మిగతాచోట్ల ఎక్కడా ఇసుక రీచ్‌లు లేవు. ఆంధ్రాలో ఉన్న రీచ్‌ల ద్వారా ఇసుకను ఇక్కడకు రానివ్వడం లేదు. సొసైటీలకు అనుమతులు ఇస్తే అన్నిచోట్ల రీచ్‌లు పెట్టుకోవచ్చు. ఇసుక వాహనాలకు సైతం అనుమతులు ఉంటే ఇసుక కొరత ఉండదు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం.
– దినేశ్, మైనింగ్ ఏడీ