భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది. రాత్రులకు రాత్రులే ఇసుకను జిల్లాలు, రాష్ర్టాలు దాటిస్తున్నారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు తలుచుకుంటే ఎంతటి అక్రమానికైనా పాల్పడొచ్చనేదానికి ఇసుక అక్రమ రవాణే ప్రత్యక్ష నిదర్శనం.
గోదావరి నదిలో రీచ్‌లకు అనుమతులు ఉండడంతో అక్కడ జీరో దందాలో ఇసుక దోపిడీ జరుగుతుండగా.. అధికారులకు ముడుపులు ముడుతుండడంతో వాగుల్లో ఇసుక ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా రవాణా జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక కొరత లేకుండా ‘మన ఇసుక వాహనాల’కు అనుమతులిచ్చి ఆన్లైన్ బుకింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నాయకులకు డబ్బులు కావాలి.. అధికారులు పరపతి పెంచుకోవాలి.. ఇంకేముంది అంతా దొడ్డిదారిలోనే ఇసుక రవాణా పెద్దఎత్తున జరుగుతున్నది. దీంతో జిల్లాలో ఇసుక పుష్కలంగా ఉన్నప్పటికీ సామాన్యుడికి మాత్రం మరింత పిరం అవుతున్నది.
– భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (నమస్తే తెలంగాణ)
కనిపించని ‘మన ఇసుక వాహనాలు’..
గోదావరి ఇసుక సామాన్యులు కొనలేరు. లారీ లోడ్ కొంటేనే తప్ప బుకింగ్ ఉండదు. మరి ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే వాగుల్లో ఉండే ఇసుక వాడుకోవాలి. కానీ.. దానికి అధికారిక అనుమతులు లేవు. మరీ ఇసుక ఎట్లా కొనాలి అంటే దొడ్డిదారిన అమ్మేవాళ్ల దగ్గర కొనాల్సిందే. జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో ఏదో ఒక వాగులో ఇసుక ఉండటం సహజం. అదే అక్రమార్కులకు వరంగా మారుతున్నది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి రాత్రిళ్లు ఇసుకను రవాణా చేసుకుంటున్నారు.
లక్ష్మీదేవిపల్లిలో ముర్రేడు వాగు, చుంచుపల్లిలో పెనుబల్లి వాగు, పాల్వంచలో కిన్నెరసాని వాగు, టేకులపల్లిలో శంభునిగూడెం వాగు, ఇల్లెందులో మసివాగు, గుండాల, ఆళ్లపల్లిలో ఏడుపాయల వాగులు, ములకలపల్లిలో కిన్నెరసాని వాగు, బూర్గంపాడులో సోంపల్లి వాగుల ద్వారా ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. వాగుల వద్ద నుంచి ‘మన ఇసుక వాహనాల’కు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇసుకకు మరింత డిమాండ్ పెరిగింది.
గోదావరిపై 23 రీచ్‌లకు అనుమతులు
బడాబాబులు బాగుపడటం కోసం గోదావరి నదిపై జిల్లాలో 23 రీచ్‌లకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. సొసైటీల పేరుతో నడిచే ఈ రీచ్‌లను బడా నాయకులు బినామీలతో నడిపిస్తుండడంతో జీరో దందాకు పాల్పడుతున్నారు. దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్నట్లుగా ఇసుక లారీలను రాత్రులకు రాత్రులు ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల మణుగూరు మండలంలో ఇసుక సొసైటీల విషయంలో మహిళా సొసైటీల మధ్య పెద్ద రచ్చనే జరిగింది. రెండు సొసైటీల సభ్యులు మాకు కావాలంటే.. మాకు అంటూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు కూడా దిగారు. చివరికి రీచ్‌లను నిర్వహించే బినామీలే రంగంలోకి దిగి రాజీ చేసుకుని రీచ్‌లను నడుపుతున్నారు. ఈ తతంగంలో అధికారులు పాత్రదారులుగా.. నాయకులు సూత్రదారులుగా నిలుస్తున్నారు.
ఇసుక పుష్కలం.. అయినా ఫిరం?
భద్రాద్రి జిల్లాలో గోదావరి నది కిలోమీటర్ల పొడవునా అటు పినపాక నుంచి ఇటు భద్రాచలం వరకు ఇసుక ఉంది. ఇక వాగులు ప్రతి మండలంలో ఏదో ఒకటి పారుతున్నది. అక్కడ ఇసుక తప్పనిసరిగా ఉంటుంది. గోదావరి నది రీచ్‌ల వద్ద ఉన్న ఇసుక హైదరాబాద్, వరంగల్, ఆంధ్రా ప్రాంతాలకు భారీస్థాయిలో తరలిపోతున్నది. ఆన్లైన్ బుకింగ్ ఉన్నప్పటికీ బ్రోకర్లు ముందుగానే బుక్ చేసి బ్లాకులో విక్రయాలు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతం వారికి ఇసుక దొరకడం కష్టంగా ఉంటోంది. వాగుల్లో ఇసుకకు అసలు అనుమతులు లేకపోవడంతో అక్రమార్కులు చెప్పిన రేటుకే సామాన్యుడు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తుండడం విశేషం.
గతంలో ‘మన ఇసుక వాహనాలు’ ఉండేవి..
వాగుల్లో పుష్కలంగా ఇసుక ఉంది. ‘మన ఇసుక వాహనాల’కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లనే ఇసుకకు డిమాండ్ పెరిగింది. వాగులో ఇసుక కూడా ట్రాక్టర్ నాలుగు వేలు అమ్ముతున్నారు. గోదావరి ఇసుక అయితే మనం కొనలేం. సొసైటీలు పేరుకే.. పెత్తనమంతా బడాబాబులదే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఇసుక వాహనాలు పెట్టడంతో సమస్య ఉండేదికాదు. ఇప్పుడు మళ్లీ ఇసుక కొరత ఏర్పడింది.
– చారుగుండ్ల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఉద్యోగి, పాల్వంచ
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి..
రాత్రిళ్లు ఇసుక తోలుతున్న ట్రాక్టర్లు వేగంగా వెళ్తుండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ట్రాక్టర్లు, ఎండ్ల బండ్లు విపరీతంగా తిరుగుతున్నాయి. పెట్రోలింగ్ చేసే పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రంతా తోలకం చేసే ఇసుక ట్రాక్టర్లను అధికారులు ఎందుకు పట్టుకోవడం లేదో అర్థంకావడం లేదు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. వాహనాలకు జరిమానాలు వెయ్యవచ్చు కదా.
– అజ్మీరా హోంజీ, కొత్తగూడెం
అక్రమ రవాణాను అడ్డుకుంటాం..
ఇసుక కొరత లేకుండా జిల్లాలో గోదావరి ప్రాంతంలో 23 రీచ్‌లకు అనుమతులు ఇచ్చాం. ప్రస్తుతం 10 రీచ్‌లు నడుస్తున్నాయి. అక్రమంగా నడిస్తే వారిని పట్టుకుంటున్నాం. సిబ్బంది లేరు.. అయినా రైడ్లు చేస్తున్నాం. వాగుల్లో ఉండే ఇసుక అంతగా నాణ్యత ఉండదు. ఇసుకకు వాగుల్లో అనుమతి ఇస్తే భూగర్భ జలం సమస్య ఉంటుంది. అందువల్ల వాగుల్లో అనుమతి ఇవ్వడం లేదు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు. తహసీల్దార్, పోలీసుల సహకారంతో దాడులు చేసి అక్రమానికి అడ్డుకట్ట వేస్తాం. గోదావరి ఇసుక చాలా నాణ్యమైనది. వాగుల్లో ఇసుక వాడితే నిర్మాణాలకు భవిష్యత్ ఉండదు.
– దినేష్, మైనింగ్ ఏడీ