ఇల్లెందు, ఫిబ్రవరి 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. ఇల్లెందులోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేగా మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇవ్వలేక ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఇటీవల జరిగిన గ్రామసభల్లో పలు సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ప్రజాదరణ ఉన్న నాయకులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఇటీవలి కాలంలో మణుగూరు, చంద్రుగొండ, ప్రస్తుతం టేకులపల్లి మండలంలో ఏ సంబంధం లేని బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
రైతుల పక్షాన నిలిచిన లక్కినేని సురేందర్రావుపై కేసు విషయంలో అధికారుల తీరు మరీ దారుణంగా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అట్రాసిటీ కేసులే నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా ఒక్క పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ పార్టీ నూరు శాతం సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, ఇల్లెందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, ఎస్.రంగనాథ్, అజ్మీరా బావ్సింగ్, జాఫర్ హుస్సేన్, బోడ బాలునాయక్, ఖమ్మంపాటి రేణుక, లాల్సింగ్, జబ్బార్, గిన్నారపు రాజేష్, సాతల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, డేరంగుల పోశం, భూక్య సురేష్, పుందూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.