మామిళ్లగూడెం, ఆగస్టు 30 : పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జిల్లా పంచాయతీ మౌలిక వనరుల కేంద్ర భవనం(డీపీఆర్సీ) శిథిలావస్థకు చేరుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది.
జిల్లాలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ చట్టాలు, విధులు, నిబంధనలపై శిక్షణ ఇచ్చేందుకుగాను దీని నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని శాఖల విభాగాల సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా భవనం నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారం చేపట్టిన తరువాత నాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ చేశారు.
భవనం పనులు పూర్తి చేసుకుని వినియోగానికి సిద్ధంగా ఉండడంతో అధికారులు వినియోగంలోకి తీసుకొచ్చారు. నూతనంగా ప్రారంభించిన భవనం అప్పుడే శిథిలావస్థకు చేరుకుంటుండడంతో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. ప్రధాన మీటింగ్ హాల్‌కు రెండు పక్కల భీమ్‌లకు ఆనుకొని ఉన్న గోడలకు పగుళ్లు వచ్చి సిమెంట్ పెచ్చులు ఊడిపోతున్నాయి.
భవన ప్రధాన ద్వారం పక్కనే గోడలకు పగుళ్లు రావడంతో ప్రజలకు లోపాలు తెలుస్తున్నాయన్న ఉద్దేశంతో అధికారులు తాత్కాలికంగా దానికి వైట్ సిమెంట్ పూసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. భవనంలో మహిళలకు కేటాయించిన మరుగుదొడ్లలో గదులకు బిగించిన తలుపులు ఊడిపోయాయి. అదే గదిలో చేతులు కడుక్కునేందుకు బిగించిన వాష్ బేసిన్ ఊడిపోవడంతో పక్కన పడేశారు. దీంతోపాటు ప్రధాన మీటింగ్ హాల్ వరండాలో కూడా ఫ్యాన్స్ బిగించాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ వాటిని బిగించకుండానే భవనం అప్పగించడంతో అధికారులు స్వాధీనం చేసుకొని వినియోగిస్తున్నారు.
భవనం బయట పార్కింగ్ ఏరియాలో వేసిన పార్కింగ్ టైల్స్ పగిలిపోయి అప్పుడే ఊడిపోతున్నాయి. భవనంలో రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. భవనం చుట్టూ చెత్త పేరుకుపోవడంతోపాటు వివిధ మీటింగ్‌ల సమయంలో వినియోగించిన బోర్డులు, ఇతర ఫ్లెక్సీలు అక్కడే వదిలేయడంతో ఆవరణ అంతా చెత్తతో నిండిపోయింది.
డీపీఆర్సీ భవన నిర్వహణను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఈ భవనం మరమ్మతులకు రావడంతో దానిపై దృష్టిసారించే వారే కరవయ్యారు. నిర్మాణంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పనులు పర్యవేక్షించిన ఇంజినీరింగ్ అధికారులు మిన్నకుంటున్నారు. పనులు చేపట్టిన గుత్తేదారుకు బిల్లులు చెల్లించిన అధికారులు నిర్వహణలో నాణ్యతా లోపాలు సవరించే పరిస్థితి కనిపించడం లేదు. లోపాలు ఈ స్థాయిలో ఉన్నప్పుడే వెంటనే మరమ్మతులు చేపడితే తక్కువ నిధులు మాత్రమే ఖర్చు అవుతాయని, వాటిని ఇలానే వదిలేస్తే మరో ఏడాదిలో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం లేకపోలేదు.
భవనం ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నది. భవనంలో వచ్చిన పగుళ్లు, ఇతర లోపాలను పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. భవనంలో నాణ్యతా లోపాలు ఉంటే గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
– యడిత్యారాజు, ఏఈఈ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం