మధిర, జూన్ 26 : యువత మాదక ద్రవ్యాలు వాడితే భవిష్యత్ అంధకారమేనని, కావునా వాటిని వాడకుండా ఉండాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మధిర మున్సిపాలిటీ పరిధిలోని దిడుగుపాడులో షేర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ తయారు చేయడం, రవాణా చేయడం, వినియోగించడం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తతో గమనించాలన్నారు. వారు చెడు వ్యసనాల వైపు మళ్లకుండా మొదట్లోనే గుర్తించాలన్నారు.
యువత సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలని, నేరాల్లో ఇరుక్కుని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ఉద్యోగులు, ప్రజలు మాదక ద్రవ్యాలు వాడే వాళ్లని ప్రోత్సహించవద్దని, ఒకవేళ వాడిన వారు మారడానికి ఉన్న అవకాశాలు అన్నింటినీ పరిశీలించి వారికి అవగాహన కల్పించాలన్నారు. మారకద్రవ్యాలు విక్రయిస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేర్ స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు గోపాలరావు, స్థానిక మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ షమీమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.పుల్లారావు, సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, చావలి రామరాజు, పారాలీగల్ వాలంటీర్స్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.