చండ్రుగొండ, మే 3: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. అసలు రైతుల పంటలను కొనే ఉద్దేశం కాంగ్రెస్ పాలకులకు లేకపోతే తక్షణమే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చండ్రుగొండ మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులతో కలిసి దామరచర్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. దీంతో అక్కడి రైతులు వచ్చి తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యేకు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సకాలంలో పంటలను కొనుగోలు చేయకుండా, మద్దతు ధరలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తద్వారా రైతులే తమ పంటలను తాము ప్రైవేటు వ్యాపారులకో, దళారులకో అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని ధ్వజమెత్తారు. సన్న రకాలు, దొడ్డు రకాలు అంటూ షరతులు పెడుతూ బోనస్‌కు ఎగనామం పెట్టేందుకు, ధాన్యం కొనుగోలుకు మంగళం పాడేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని దుయ్యబట్టారు.
కొర్రీలు లేకుండా రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కొణకండ్ల వెంకటరెడ్డి, దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, ఇర్పా స్రవంతి, కొడెం కృష్ణవేణి, గుగులోత్ ప్రవీణ్ ప్రకాశ్, నల్లమోతు వెంకటనారాయణ, నరుకుళ్ల సత్యనరాయాణ, సూర వెంకటేశ్వర్లు, మేడా మోహన్‌రావు, భూపతి రమేశ్, గాదె లింగయ్య, గుగులోత్ రమేశ్, పాండ్ల అంజన్‌రావు, భూపతి శ్రీనివాసరావు, బడికల శ్రావణ్, బాలునాయక్, కళ్లెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.