అశ్వారావుపేట, నవంబర్ 19: నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ‘పేదల ఇళ్లను కూల్చడమే ప్రజా పాలనా?’ అంటూ ప్రశ్నించారు. అధికారులు అశ్వారావుపేటలో ఇటీవల కూల్చివేసిన గుడిసెలను బుధవారం ఆయన పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వాస్తవ పరిస్థితుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాళ్లపై పడినా కనికరం చూపలేదని, నిలువ నీడ లేకుండా చేసి రోడ్డున పడేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం, తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పొద్దంతా కష్టపడి పనులు చేసుకునే కూలీలపై దౌర్జన్యం చేస్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుడిసెలు వేసుకోవడమే తప్పా? స్వార్థ రాజకీయాల కోసం వాటిని కూల్చివేస్తారా?’ అంటూ ధ్వజమెత్తారు.
బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని, ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. తహసీల్దార్ రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడారు. పేదల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తుండగానే తహసీల్దార్ ఫోన్ కట్ చేశారు. దీంతో నేరుగా కలెక్టర్‌తో మాట్లాడుతానని బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, సీపీఐ జిల్లా నాయకుడు సయ్యద్ సలీం ఉన్నారు.
ప్రత్యామ్నాయం చూపండి: బీఆర్ఎస్
నిరుపేదలకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు జుజ్జూరు వెంకన్నబాబు, సత్యవరపు సంపూర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం వారు సందర్శించారు. శిబిరంలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలకు ఇంటి స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి గుడిసెలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు మందపాటి రాజమోహన్‌రెడ్డి, నారం రాజశేఖర్, నక్కా రాంబాబు, జుజ్జూరపు శ్రీరామ్మూర్తి, గోవింద్, రఘురాం, నందికోళ్ల వెంకన్న, తాళం సూరి, చరణ్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.