ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 15లోగా ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టకపోతే ఆ ఇళ్లను రద్దు చేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లు మంజూరైన వారిలో ఆర్థికంగా ఖర్చులు భరించే స్తోమతలో ఉన్న కొందరు లబ్ధిదారులు నిర్మాణాలను మొదలుపెట్టారు. అప్పులు తెచ్చుకోగలిగే సామర్థ్యమున్న మరికొందరు లబ్ధిదారులు అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు.
ఇక అప్పులు కూడా తెచ్చుకోలేని పేదరికంలో ఉన్న ఇంకొందరు లబ్ధిదారులు చేతిలో చిల్లిగవ్వలేక, నిర్మాణాలు చేపట్టే స్తోమత లేక బిక్కమొహం వేస్తున్నారు. ఇలాంటి వారికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం ఇప్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వీరిలో అత్యధికులు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేకపోవడం, ఒకవేళ ఉన్నా వారు అప్పటికే రుణభారంలో కూరుకుపోవడం వంటి కారణాలతో అక్కడి నుంచి కూడా రుణం లభించే అవకాశం లేకుండాపోతోంది.
ఇలాంటి కారణాల రీత్యా ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని వారు ఖమ్మం జిల్లాలో సుమారు 5 వేల మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాకు మంజూరైన మొత్తం 15,625 ఇళ్లలో ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని వారే దాదాపుగా సింహభాగం ఉండడం గమనార్హం. అయితే, వీరు మరో 15 రోజుల్లో నిర్మాణాలు మొదలు పెట్టకపోతే ఇళ్లు రద్దు చేస్తామంటూ అధికారులు భయాందోళన కలిగిస్తుండడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
-సత్తుపల్లి, ఆగస్టు 2
ప్రభుత్వ నిబంధనలు, పెరిగిన ఖర్చులతో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కరువైంది. ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామంటూ గొప్పగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ విడతలో చాలా మందికి కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించింది. ఈ విషయంపై గ్రామసభల్లో అర్హుల నిలదీతలు కొనసాగాయి.
దీంతో అక్కడో ఇక్కడో ఒక్కరికో ఇద్దరికో నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్లు మంజూరైన అధికార పార్టీ కార్యకర్తలు, పలుకుబడితో ఇళ్లను పొందిన ఆర్థిక స్తోమత గల వారు ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టారు. చేతి నుంచి రూ.లక్ష వెచ్చించే స్తోమత లేని అసలైన నిరుపేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. నిర్మాణాలు మొదలు పెట్టకపోతే ఆ ఇళ్లను మరొకరికి కేటాయిస్తామంటూ నిరుపేదల లబ్ధిదారులపై అధికారులతో ఒత్తిడి చేయిస్తోంది.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సొంత స్థలం ఉన్న వారిని ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మించాలని నిబంధన విధించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పింది. కాగా, ఈ నిబంధనలతో చాలామంది లబ్ధిదారులు ఇంటిని నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో కుటుంబానికి 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపడితే అసౌకర్యంగా ఉంటుందంటూ ఎక్కువ మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
నత్తనడకన నిర్మాణాలు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఖమ్మం జిల్లాలో నత్తనడకన కొనసాగుతున్నాయి. ఓ వైపు పెరిగిన ధరలు, మరోవైపు కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో చాలా వరకు నిర్మాణ పనులను మొదలు పెట్టలేదు. కొందరు మాత్రమే బేస్మెంట్ లెవల్ వరకు పూర్తిచేశారు. మరికొంతమంది మాత్రమే రూఫ్ లెవల్ దాకా పూర్తి చేశారు. ఇంకా సింహభాగం మంది బేస్మెంట్లు కూడా ప్రారంభించలేదు.
ఇసుక కష్టాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కష్టాలు కూడా తోడయ్యాయి. ఈ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ట్రాక్టర్ యజమానులు లబ్ధిదారులను నిలువునా దోచుకుంటున్నారు. ఒక ట్రిప్పు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు.. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలతో ఆర్థికభారం పడి వెనుకడుగు వేస్తున్నారు.
జిల్లాలో 15,625 ఇళ్లు మంజూరు
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 15,625 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 10,761 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు ఇళ్ల నిర్మాణం మొదలుకాకపోగా.. కొన్ని బేస్మెంట్ లెవల్లోనే ఆగిపోయాయి. బేస్మెంట్ లెవల్ పూర్తి చేసిన వారిలో కొందరికి మాత్రమే రూ.లక్ష చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించలేదు. ఇక రూఫ్ లెవల్ పూర్తిచేస్తే రూ.1.20 లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75 లక్షలు, ఇంటి పనులు పూర్తయితే మరో రూ.లక్ష చెల్లిస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇక, పెరిగిన ధరల కారణంగా నిర్మాణానికి ఈ డబ్బులు సరిపోవని లబ్ధిదారులు వాపోతున్నారు.
15లోపు మార్కింగ్ వేయలేదో..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎలాగైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15 వరకు ఇంటి నిర్మాణానికి మార్కింగ్ చేయించుకోకపోతే వారి ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోకపోతే ఆ ఇళ్లను రద్దు చేసి మిగిలిన వారికి కేటాయించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలి..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలి. ముహూర్తాలు చూసుకుంటే గడువు దాటే ప్రమాదముంది. ఇప్పటికే లబ్ధిదారులందరికీ అవగాహన కల్పిస్తున్నాం. లబ్ధిదారులు త్వరితగతిన ముందుకొచ్చి ఇళ్లు నిర్మించుకోవాలి.
-శ్రీనివాస్, పీడీ, గృహ నిర్మాణ శాఖ, ఖమ్మం