Madhira | మధిర, జూన్ 27 : వంద పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ఐద్వా మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శలు గౌరరాజు ధనలక్ష్మి, చేగొండి వెంకయమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం మధిరలోని ప్రభుత్వ హాస్పిటల్‌ను ఐద్వా మహిళా సంఘం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ నందు పేషెంట్లకు సరిపడా పడకలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బిల్డింగ్ వర్షం కురవడం వల్ల నీళ్లు కారుతున్నాయాన్నారు.
పేషంట్లకు సరిపడా వసతులు వైద్యం అందుబాటులో ఉండటం లేదని అన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన నూతన బిల్డింగ్ నిరుపయోగంగా మారిందన్నారు. మధిర ప్రాంతంలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన ఏకైక పెద్ద హాస్పిటల్ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన మధిర నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టదాయకమని అన్నారు. అనంతరం హాస్పిటల్ ప్రారంభించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు పాల్గొన్నారు.