శాతం లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యంతోపాటు అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది జనవరి కంటే ఏప్రిల్, మే నెలల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎక్కువమంది కేంద్రాలకు హాజరైనట్లు చెబుతున్న అధికారుల లెక్కలు చూస్తే నిజంగా హాజరయ్యారా..? అంకెలగారడీనా.. అర్థంకావడం లేదు. ప్రతిసారి వేసవిలో హాజరు శాతం తగ్గడం సర్వసాధారణం. జిల్లాలో మొత్తం ఏడు ప్రాజెక్టులు.. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, కల్లూరు ఉన్నాయి. వీటి పరిధిలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే అన్ని ప్రాజెక్టుల్లోనూ జనవరి నెలకు మించి వేసవిలో హాజరు శాతం పెరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భగభగమండే ఎండల కారణంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడం లేదని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం వేసవిలో సెలవులు ప్రకటించాలని కోరుతూ టీచర్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయడం విశేషం.
మాతా, శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం అందించడంతోపాటు చిన్నారులకు చిన్నతనం నుంచి విద్యపై పట్టు సాధించేందుకు అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తుంటాయి. అయితే పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీలకు సైతం పండుగల వేళ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతల హాజరు శాతం తగ్గడం సర్వసాధారణం. అయితే జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతాన్ని పరిశీలిస్తే.. ఎండవేడిమి ఎంత ఎక్కువైతే అంత హాజరు శాతం పెరగడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ అంకెలు చూస్తే ‘చిత్రం భళారే విచిత్రం’లా కనిసిస్తున్నది. జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, కల్లూరు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనంతోపాటు 200 గ్రాముల పాలు, కోడిగుడ్డు అందిస్తారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం పంపిణీ చేస్తారు. వీటితోపాటు నిబంధనలకు అనుగుణంగా పిల్లల బరువులు, ఎత్తు కొలతల వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తుంటారు. కేంద్రాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే గర్భిణులు, బాలింతలతోపాటు ప్రీస్కూల్, ఇతర పిల్లల వివరాల హాజరును సైతం నిత్యం ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ నెల వచ్చేసరికి వేసవి తాపం మరింత పెరిగింది. ఏ సంవత్సరంలోనైనా ఎండాకాలం వచ్చిందంటే గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారుల హాజరు శాతం తక్కువ నమోదు కావడం సర్వసాధారణం. అయితే జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో సైతం జనవరి నెలకు మించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు శాతం పెరగడం గమనార్హం.
అక్కడ పెరిగింది.. ఇక్కడ పెరగలేదు.. అనే సందేహం లేకుండా జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోనూ అటు చిన్నారులు, ఇటు గర్భిణుల హాజరు శాతం అమాంతం పెరిగింది. కొద్దినెలలుగా ఆయా ప్రాజెక్టులకు పప్పు దినుసుల సరఫరా నిలిచింది. దీనికితోడు పాల పంపిణీ సైతం అక్కడక్కడ నిలిచిపోయింది. అంగన్వాడీ టీచర్లు బీఎల్వో డ్యూటీలు చేసుకుంటూ ఇటు కేంద్రం బాధ్యతలు సైతం నిర్వహించారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ హాజరు శాతంలో మాత్రం రికార్డు నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఏడు ప్రాజెక్టుల్లో కలిపి పరిశీలిస్తే జనవరి నెలలో చిన్నారుల హాజరు 59,010 మంది కాగా, గర్భిణులు, బాలింతలు 15,081 మంది హాజరయ్యారు. ఏప్రిల్లో చిన్నారులు 60,833, గర్భిణులు, బాలింతలు 14,942 మంది హాజరయ్యారు, ఇకపోతే రికార్డుస్థాయిలో ఎండలు కొట్టిన మేలో చిన్నారులు 61,182 మంది, గర్భిణులు, బాలింతలు 14,838 మంది హాజరయ్యారు. ప్రతిఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది, వేసవికావడంతో తల్లిదండ్రులు ప్రయాణాలు చేసే అవకాశం ఉండడంతో పిల్లల హాజరుపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ సంవత్సరం చరిత్రలో లేనివిధంగా ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు నమోదు అయినప్పటికీ హాజరు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా.. పిల్లలు, గర్భిణులు కేంద్రాలకు రావడం తగ్గిందని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీలకు సైతం సెలవులు ప్రకటించాలని టీచర్లు కలెక్టర్, డీడబ్ల్యూవోకు ఇటీవల వినతిపత్రాలు అందజేయడం విశేషం. అయితే ఈ గణాంకాలు క్షేత్రస్థాయి నుంచి అంకెలగారడీ చేశారా.. లేదా.. యాదృచ్ఛికంగా భారీగా హాజరయ్యారా.. అనేది తెలియాల్సి ఉంది.
అంగన్వాడీ కేంద్రాల్లో సాధారణంగా ఏప్రిల్ నెలలో హాజరు శాతం పెరుగుతుంది. ఏప్రిల్లో టీచర్లు, హెల్పర్లు స్పెషల్ డ్రైవ్ చేస్తారు. బహుశా హాజరు శాతం పెరగడానికి ఇదే కారణం కావచ్చు. విద్యా సంవత్సరం ముగిసిన తరువాత నెల కాబట్టి సిబ్బంది చొరవతోనే హాజరు శాతం పెరిగింది. జనవరితో పోల్చుకుంటే తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టుల వారీగా హాజరు శాతం పరిశీలించాల్సి ఉంది.