మధిర, ఆగస్టు 24: భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన సంఘటన మధిర (Madhira) మండలంలోని మాటూరులో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
చిల్ల సూర్యనారాయణ, సాయి నాగలక్ష్మి భార్యాభర్తలు. ఇంట్లో ఇద్దరూ ఘర్షణపడి బయటకు వచ్చారు. చికెన్ షాప్లో ఉపయోగించే కత్తితో భార్య మెడపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రోడ్డుపై అపస్మారస్థితిలో పడి ఉన్న సాయి నాగలక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలించారు.
కాగా, నాగలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకున్నదని సూర్యనారాయణ అనుమానిస్తున్నాడు. ఏడాది క్రితం కూడా అనుమానంతో ఆమె తలపై రోకలిబండతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.