మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నాటి ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి స్థానాలు సాధించలేపోయింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ.. మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసింది. సీపీఐ ఆశించిన స్థానాలు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో పొత్తులు పొసగక సీపీఐ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. కొత్తగూడెంలో దీని ప్రభావం స్పష్టంగా కన్పించింది. అధికార పార్టీని దాని మిత్రపక్షమైన సీపీఐ నేతలే కట్టడి చేసినట్లయింది. దీంతో 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు చెరో 22 డివిజన్లను గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 31ని ఆ రెండు పార్టీల్లో ఏ ఒక్కటీ దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 8 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ కీలకమైంది. దీంతో సీపీఐకి మద్దతిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 222 వార్డుల్లో 34 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 13
కొత్తగూడెంలో 22 స్థానాలు గెలుచుకున్న సీపీఐకి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సంసిద్ధత ప్రకటించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై సీపీఐ వైఖరి తేలాల్సి ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి కొత్తగూడెం శాసనసభ స్థానంలో పోటీచేసిన సీపీఐ.. ఆ స్థానాన్ని గెలుచుకొని కాంగ్రెకు మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. దీంతో సీపీఐ, కాంగ్రెస్ మధ్య కొత్తగూడెంలో తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకొని అన్నీ తానై వ్యవహరించారు. కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని సీపీఐ దక్కించుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అదేస్థాయిలో వ్యూహరచన చేశారు. అదేస్థాయిలో అధికార పార్టీని కట్టడి చేశారు. అధికార పార్టీ తమను వేధిస్తోందని, ఇక ఓర్పుతో ఉండలేమని, యుద్ధం ప్రకటించామని, తాను పిల్లిని కాదని, పులినని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని.. పోలింగ్ రోజైన బుధవారం అర్ధరాత్రే మీడియా సాక్షిగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి ఫలితాలు కూడా హంగ్‌కు దారి తీయడంతో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కొత్తగూడెంలో ఇప్పటికిప్పుడు కలిసి నడిచే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కలిసి కొత్తగూడెంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. అయినప్పటికీ అడ్డదారిలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐకి మద్దతివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సీపీఐ, బీఆర్ఎస్ దోస్తీ కడితే సీపీఐ బలం 30కి చేరుకుంటుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటు ఎలాగూ ఉంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 31 దాటే అవకాశం ఉంది. అలాగే, ఆరుగురు స్వతంత్రులతోపాటు బీజేపీ, సీపీఎం నుంచి ఒక్కో అభ్యర్థి చొప్పున గెలిచారు. అయితే, స్వతంత్రుల మద్దతు కోసం సీపీఐ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇచ్చినా ఒక సంఖ్య మాత్రమే పెరుగుతుంది. ఇక బీజేపీ మాత్రం సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఏదులాపురంలో కాంగ్రెస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధిస్తే రీ కౌంటింగ్‌కు అవకాశం ఇచ్చిన అధికారులు.. స్వల్ప తేడాతో ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో సీపీఎం, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థన మేరకు రీ కౌంటింగ్ చేసినా.. స్వతంత్ర అభ్యర్థే గెలిచారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మరి తమ అభ్యర్థికెందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ ప్రశ్నించారు. కాగా, వైరా 15వ వార్డులో రీ కౌంటింగ్ నిర్వహించగా సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఉమ్మడి జిల్లాలోని ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే గులాబీ పార్టీయే కీలకం కాబోతోంది. ఆరు స్థానాల్లో గెలిచిన స్వతంత్రులు కూడా ప్రధాన పాత్ర పోషించనున్నారు. అయితే, స్వతంత్రులపై ఇప్పటికే సీపీఐ కన్నేసి తెరచాటు రాజకీయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.