ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ ఆ వివరాలు వెల్లడించారు. ఏన్కూరుకు చెందిన గాజుల నర్సింహారావు అనే వ్యక్తి.. పలువురు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు ఈ నెల 28న సమాచారం అందిన వెంటనే టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు, పోలీసులు, వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించి అతడి వద్ద నుంచి వివిధ పేర్లతో ఒక్కోటి 450 గ్రాముల బరువున్న పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే, ఈ నెల 27న పోలీసులు, వ్యవసాయాధికారులు ఏన్కూరు మండలం రేపల్లెవాడ శివారులోని వెనిగండ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా.. 210 ప్యాకెట్లలో ఉన్న ఒక కేజీ నకిలీ విత్తనాలు బయటపడ్డట్లు తెలిపారు. అదేరోజు పక్కా సమాచారంతో ఏన్కూరులోని పోలేటి కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీలు చేయగా.. 20 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయని తెలిపారు.
ఈ మూడు ఘటనల్లోనూ ఏపీలోని మైలవరం, బాపట్ల, తెనాలి ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నట్లు తమ విచారణ తేలిందని వివరించారు. ఈ కేసుల్లో మొత్తం 11 మంది నిందితులను రిమాండ్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో కల్లూరు ఏసీపీ రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సైలు రఫీ, హరిత తదితరులు పాల్గొన్నారు.