మామిళ్లగూడెం, జూన్ 23: ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్‌నాయక్ సంబంధిత వార్డెన్లను ఆదేశించారు. ఆదివారం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర, బీసీ, ఆనందనిలయం వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలు వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్‌హాల్, కిచెన్లను పరిశీలించారు. స్టోర్స్‌లో వంట సామగ్రిని పరిశీలించారు. కూరల్లో వాడే కారంను పరిశీలించి శాంపిల్ తీసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలు, మెనూను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటించాలని, సరిపోను వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహ విద్యార్థులను భోజనం, చదువు, ఏవైనా సమస్యలు ఉన్నయా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మంచాలు వెనుక భాగంలో బయట ఉండడాన్ని గమనించి వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పనికిరాని వాటిని స్రాప్గా తీసివేయాలని ఆదేశించారు. బయటి వ్యక్తులను హాస్టల్లోనికి అనుమతించరాదని సూచించారు. నిర్వహణ లోపాలను సహించేది లేదని, లోపాలు ఉంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.