ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మార్చి 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హోలీ అదిరింది. రంగుల పండుగను ప్రతిఒక్కరూ ఎంతో సంబురంగా జరుపుకున్నారు. గురువారం అర్ధరాత్రి కాముడిని దహనం చేసి శుక్రవారం పండుగ చేసుకున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. యువతీ, యువకులు చిందేశారు.
కేరింతలు కొట్టారు. ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొట్టారు. ఇక చిన్నారుల ఆనందానికి హద్దుల్లేవు. మహిళలు సైతం రోడ్లెక్కి రంగులు జల్లుకున్నారు. గ్రామగ్రామాన కులమతాలకు అతీతంగా జరిగిన హోలీ వేడుకలు మనుషుల మధ్య అనుబంధాలు, ప్రేమానురాగాలను ప్రతిబింబించాయి.
విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలన్నింటికీ సెలవుకావడంతో ఇంటిల్లిపాది వేడుకల్లో మునిగితేలారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు సైతం వేడుకల్లో పాల్గొని ఉత్సాహపరిచారు.