– ఎన్నిక నిర్వహించకుండా అడ్డుకున్న కాంగ్రెస్
– అధికార పార్టీకి వంత పాడుతున్న అధికారులు
– నాలుగు గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్న వార్డు సభ్యులు
ఖమ్మం రూరల్, డిసెంబర్ 15 : ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 167 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 156 ఓట్లు రావడం జరిగింది. కౌంటింగ్లో పొరపాట్లు జరిగాయని పేర్కొంటూ బీఆర్ఎస్ కూటమి శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చివరకు అధికారులు కాంగ్రెస్ పార్టీ ఓటమి అభ్యర్థి కుమ్మరి అంబేద్కర్ విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని గెలుపొందిన వార్డు సభ్యులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు.
దీంతో అనుకున్న సమయానికి బీఆర్ఎస్ కూటమికి చెందిన వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి సర్పంచ్ వార్డు సభ్యులు రాకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక జరపకుండా అధికారులు జాప్యం చేశారు. మెజారిటీ వార్డు సభ్యులు హాజరైనప్పటికీ ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ వార్డు సభ్యులు మధ్యాహ్నం నుండి పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం ఆర్డీఓ గ్రామానికి చేరుకున్న సమయంలో కారుకు అడ్డంగా పడుకుని మరోసారి వార్డు సభ్యులు నిరసన తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా గ్రామానికి చేరుకుని బందోబస్తు చేపట్టారు.