ఖమ్మం, అక్టోబర్ 9: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ నేత గుండాల(ఆర్జేసీ) కృష్ణ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు మళ్లీ అన్యాయమే జరిగినైట్లెందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో బీసీ కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అగ్రవర్ణాల ఆధిపత్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
చీకట్లో గొంగడి కప్పుకొని చాటుగా రిజర్వేషన్ ఇవ్వొచ్చా.. లేదా.. అని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం హకుగా రావాల్సిన రిజర్వేషన్లను అడ్డుకునేందుకు హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. ఏదేమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కురాకుల నాగభూషణం, బొమ్మా రాజేశ్వరరావు, కత్తి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.