కూసుమంచి, మార్చి 2: ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం నాయకుడు చంద్రకుమార్ అన్నారు. నేటి పాలకులు కర్షకుడి కష్టాలను గుర్తించాలని కోరారు. కూసుమంచి మండలం తురకగూడెంలో యువరైతు బుర్రా దర్గయ్య.. పత్తి, వరి, పొలాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో అప్పుల బాధ భరించలేక గత నెల 24న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
ఆ కుటుంబాన్ని రాష్ట్ర రైతు సంఘం బాధ్యులు ఆదివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో హైకోర్టు రిటైర్డు జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలు తనను కలిచివేశాయని, ఎలాంటి జీతాలు లేకుండా కేవలం దేశం కోసం తన కష్టాన్ని పంచే రైతులు అప్పులతో తనువు చాలిస్తుంటే బాధగా ఉందన్నారు.
ఇలాంటి ఘటనలు మానవాళికి ఆహారాన్ని తయారుచేసే వారి కటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తాయని, అది మంచి పరిణామం కాదని అన్నారు. రైతు ఆత్మహత్యలు లేని సమాజం ఏర్పడాలని అన్నారు. 2016 నుంచి రైతు సంక్షేమ సంఘం రైతుల కోసం పని చేస్తున్నదని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమ సంఘం బాధ్యులు నర్సింహారావు, అనంతరెడ్డి, శ్రీనివాసరావు, గ్రామస్తులు లింగయ్య, వెంకన్న, నరేశ్, గోపి, భాస్కర్రావు, వెంకట రమణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.