గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ జుజ్జుల్‌రావుపేట వద్ద తెగిపోయింది. అనేక చెరువు కట్టలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు తెగిపోయాయి. అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అయితే గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కానీ.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏ మాత్రం ప్రణాళికలు రూపొందించలేదు. కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం భారీగానే ఉండే ప్రమాదం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ముఖ్యంగా నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న నీటి వనరులను కాపాడటంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
– ఖమ్మం, మే 26
ఖమ్మం జిల్లాలో మేజర్ ఇరిగేషన్ కింద పాలేరు, వైరా, లంకాసాగర్ చెరువులు ఉన్నాయి. ఇవికాకుండా మైనర్ ఇరిగేషన్ కింద మరో 1,400 చెరువులు ఉన్నవి. వాటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాగార్జునసాగర్ కాలువ ద్వారా చెరువులను నింపుతున్నారు. దీనివల్ల సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నవి.. చేపల ఉత్పత్తి విరివిగా పెరిగింది. మెట్ట ప్రాంతాల్లో కూడా వరిని పండిస్తున్నారు.
ఐతే గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీసి చెరువుల స్థిరీకరణను పెంచింది. వందల కోట్ల రూపాయలను వెచ్చించి చెరువు కట్టలు, తూములను పటిష్టం చేసింది. ఐతే గత ఏడాది భారీగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని అనేక చెరువు కట్టలు తెగిపోయాయి. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ శాశ్వత పద్ధతిలో మరమ్మతులు చేయకపోవడం వల్ల భారీ ప్రమాదం పొంచి ఉంది. చెరువు కట్టలను పటిష్టం చేయాలని, తూముల రిపేరుకు నిధులు ఇవ్వాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. చెరువుల్లో కనీసం పూడిక తీయాలని వేడుకుంటున్నారు.
సాగర్ కాలువ.. నో క్లియర్
నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ మూడు జిల్లాలకు సాగునీరు అందిస్తున్నది. ఈ కాలువ మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందిస్తారు. ఈ జోన్లో రైతులకు సాగర్ నిండుగా నిండితే జూలై 10వ తేదీనే నీరు విడుదల చేస్తారు. రెండో జోన్లో ఖమ్మం జిల్లాకు, మూడో జోన్ ఏపీకి చెందిన కృష్ణా జిల్లా రైతులకు సాగునీరు అందిస్తారు. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు 2,54,174 ఎకరాలు ఉంది.
ఇదికాకుండా పాలేరు ద్వారా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా 58 వేల ఎకరాలు, చెరువుల ద్వారా లక్ష ఎకరాలు, లిఫ్ట్‌ల ద్వారా మరో 50 వేల ఎకరాలకు మొత్తం ఖమ్మం జిల్లాలోని 4 లక్షల 50 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు ఈ ప్రధాన ఎడమ కాలువ ద్వారా అందుతున్నది.
అలాంటి కాలువపైన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చెట్లు పెరిగి దెబ్బతిన్నది. కాలువ మొత్తం జంగిల్‌తో నిండి ఉంది.. కాలువను శుభ్రం చేసేవారు లేరు.. ప్రభుత్వం ఇప్పటివరకు జంగిల్ క్లియరెన్స్ కోసం నిధులు విడుదల చేయలేదు. జిల్లాలోని ఖమ్మం, కల్లూరు డివిజన్ల పరిధిలోని అనేక ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం ఎక్కువ కురిసి, వరదలు వస్తే కాలువలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐనా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
కొత్త లిఫ్ట్‌లు లేవు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త లిఫ్ట్‌లు మంజూరు చేయలేదు.. పాలేరు నియోజకవర్గంలో మంజూరు చేశామని అమాత్యులు ప్రకటనలు చేశారు కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 48 లిఫ్ట్‌ల్లో సగానికి పైగా మరమ్మతులు చేయాల్సి ఉందని నీటిపారుదల శాఖకు చెందిన కల్లూరు డివిజన్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ఫలితంగా వాటికి భవిష్యత్‌లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎక్కడా పనులు జరగట్లేదు..
వానకాలం సీజన్ ప్రారంభంకానుంది.. మరో వారంలో తెలంగాణకు రుతుపవనాలు తాకవచ్చు. ప్రతి ఏడాది జూలైలో నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువకు నీరు విడుదల చేస్తారు.. మరో నెలరోజులు మాత్రమే ఉంది.. కానీ.. ఇంతవరకు జంగిల్ క్లియరెన్స్ లేదు.. నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తే రూ.40 లక్షలు మంజూరయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తికాలేదు.. పనులు ఇంకా ప్రారంభంకాలేదు. ఈలోపు వర్షాలు కురిస్తే పనులు జరిగే అవకాశం అసలే లేదు.
కాలువలను బాగు చేయాలి..
వానకాలం వస్తున్నది.. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని చెబుతున్నారు. కానీ ఇంతవరకు సాగర్ కాలువపైన ఉన్న చెట్లను క్లియర్ చేయలేదు. ఇప్పటికే అదపాదడపా వానలు వస్తున్నాయి.. ఐనా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధాన కాలువతోపాటు పిల్ల కాలువలు కూడా అంతే ఉన్నాయి. వాటిలో కనీసం పూడిక కూడా తీసిన పాపానపోలేదు.
– సరిత, టేకులపల్లి, ఖమ్మం
చెరువుల్లో పూడిక తీయట్లేదు..
కేసీఆర్ ప్రభుత్వంలో చెరువులను అద్భుతంగా తయారు చేశారు. చెరువుల లోతు పెంచడం వల్ల ఆయకట్టు మొత్తం పంటలు పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు నాయకులెవ్వరూ చెరువులను పట్టించుకోవట్లేదు.
– స్వాతి, ఖానాపురం, ఖమ్మం