సత్తుపల్లి టౌన్/అశ్వారావుపేట/దమ్మపేట/వేంసూరు/పెనుబల్లి/ఇల్లెందు, ఏప్రిల్ 7 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే రైతులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం కొన్నిచోట్ల తడవగా.. మరికొన్నిచోట్ల టార్పాలిన్లు, బరకాలు కప్పి పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. సత్తుపల్లి మండలంలో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షంతో పక్వానికి వచ్చిన మామిడి కాయలు చాలాచోట్ల రాలిపడ్డాయి.
అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం తడిసిపోయినట్లు తెలిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అశ్వారావుపేట మండలంలో అకాల వర్షం కురిసింది. ఆసుపాక, వినాయకపురం, మామిళ్ళవారిగూడెం తదితర గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఆరబెట్టిన వేరుశనగ, పొగాకు బేళ్లు తడవకుండా రైతులు బరకాలు కప్పుకున్నారు. తడిసిన పొగాకు నాణ్యత కోల్పోవడంతో గిట్టుబాటు ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామన్నగూడెం సమీపంలోని రోడ్డుపై చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది.
దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. పలుచోట్ల పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో రైతులకు కొంత మేర నష్టం వాటిల్లింది. వేంసూరు మండలంలో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యపు రాశులపై పట్టాలు కప్పుకున్నారు. పెనుబల్లి మండలంలో మొక్కజొన్న, ధాన్యపు రాశులపై రైతులు పట్టాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. మామిడి రైతులకు కొంతమేర నష్టం వాటిల్లింది. రాలిపోయిన మామిడి, తడిచిన ధాన్యం రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.