ఆళ్లపల్లి, ఆగస్టు 4: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్ళల్లోకి నీరు చేరింది. ఆళ్లపల్లి మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికదోన్నెతోపాటు చిన్నచిన్న వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడెం- మర్కోడు- ఆళ్ళపల్లి ప్రధాన రహదారిపై అనిశెట్టిపల్లి గ్రామ శివారులోని పుణ్యపువాగు ఉప్పొంగడంతో అక్కడికి చేరుకున్న ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు హెచ్చరించారు. మర్కోడులో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.
పాల్వంచ, ఆగస్టు 4: పాల్వంచ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాంట్రాక్ట్కాలనీ, ఒడ్డుగూడెం, హిల్స్‌కాలనీ, జయమ్మకాలనీ, వెంగళరావునగర్, ప్రశాంత్‌కాలనీ, వికలాంగులకాలనీ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాతిచెరువు అలుగుపడి ములకలపల్లి- పాల్వంచ రహదారిపై నీరు ప్రవహించింది.
టేకులపల్లి, ఆగస్టు 4: టేకులపల్లి మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీవో కార్యాలయం స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎస్వో ఉదయ్‌భాస్కర్ తెలిపారు. మంగళవారం టేకులపల్లి వచ్చిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మాన్యువల్ రైన్గేజ్తోపాటు, ఆటోమేటిక్ వెదర్స్టేషన్ను సందర్శించి గత రాత్రి 124.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గుర్తించారు. ఆయన వెంట డీటీ కృష్ణప్రసాద్, మండల గణాంక అధికారి ఎస్కే ఫిరోజ్, ఏడబ్ల్యూఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రూప్సింగ్ ఉన్నారు.
పాల్వంచరూరల్, ఆగస్టు 4: కిన్నెరసాని ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 400 అడుగులు దాటింది. ఎగువన బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద నెమ్మదిగా ప్రాజెక్టులోకి చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, 406 అడుగుల వద్ద నీటిమట్టాన్ని స్థిరీకరించి అదనంగా వచ్చే చేరే వరదను దిగువకు విడుదల చేస్తారు. ప్రస్తుతం 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతున్నది.