అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో సోమవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, మల్లాయిగూడెం, పండువారిగూడెం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, నందిపాడు, దురదపాడు, మొద్దులమాడ, ఉట్లపల్లి, అశ్వారావుపేట మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో సుమారు 2గంటలపాటు ఏకధాటిగా కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండి 2గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దబ్బతోగుకాలనీలో విద్యుత్ వైర్లపై చెట్టు పడడంతో స్తంభం విరిగిపడింది. రంగాపురం- మొద్దులమాడ, వినాయకపురం-ఉట్లపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పలు గ్రామాలు అంధకారంగా మారాయి. అశ్వారావుపేట-నందిపాడు ప్రధాన రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈదురుగాలులకు పలువురి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అశ్వారావుపేట పట్టణంలో పలు వీధులు పొంగిపొర్లాయి. వర్జీనియా పొగాకు, జీడిమామిడి, మామిడి. మొక్కజొన్న, వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగింది. అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇల్లెందు, ఏప్రిల్ 6: ఇల్లెందు మండలంలో సోమవారం రాత్రి రాళ్లవాన కురిసింది. దీంతో రైతులు కల్లాల్లో ఆరబోసి ఉన్న మొక్కజొన్న తడిసి ముద్దయింది. కొమరారం సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఉంచిన మొక్కజొన్న పంట కూడా తడిసింది. నోటికాడికొచ్చిన మొక్కజొన్న తడవడంతో రైతులకు తీరని నష్టం సంభవించింది.
భద్రాచలం, ఏప్రిల్ 6: భద్రాచలంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గంటపాటు వాన దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీల్లో కాల్వలు నిండిపోయి చెత్తంతా రోడ్లపైకి చేరింది. రామాలయం పరిసరాల్లో భక్తులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. 2 గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది.