భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ఈయన పేరు బట్టు కృష్ణ. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం నెలకు రూ.13,500. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పుతెచ్చి ఇంటిని నడుపుతున్నాడు. ఇద్దరు పిల్లలు.. ఒకరు బీటెక్ చదువుతుంటే.. మరొకరు 8వ తరగతి. అసలే చాలీచాలని వేతనం.. అందులోనూ మూడునెలలుగా జీతం లేకపోతే బతికేదెట్లా అని లబోదిబోమంటున్నాడు. ఇదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 34 మంది ఆరోగ్యమిత్రలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికైనా సర్కారు పట్టించుకొని జీతాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటేనే బండెడు చాకిరీ, సమయానికి జీతాలు రావు. ఇదే కోవకు చెందిన ఆరోగ్యమిత్రలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమించుకుంటుంది. కానీ.. ఆ ఏజెన్సీలు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా చుక్కలు చూపెడుతున్నాయి. ఆరోగ్యమిత్రలు గతంలో ఒక ఏజెన్సీ ద్వారా నియమించబడ్డారు. ఇప్పుడు ఆ ఏజెన్సీ వారి పీఎఫ్‌లు, ఈఎస్ఐలు చెల్లించకపోవడంతో వారి జీతాల బిల్లులు ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో కొత్త ఏజెన్సీ ద్వారా వీరి జీతభత్యాలు ఇచ్చేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.. కానీ.. కొత్త ఏజెన్సీ రికార్డులు సమయానికి సబ్మిట్ చేయలేకపోవడంతో జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆరోగ్యమిత్రల బతుకు అగమ్యగోచరంగా తయారైంది.
అసలే చాలీచాలని జీతం. అన్నీ ప్రైవేటు చదువులే. బడి ఫీజులు చెల్లించలేక అప్పుల పాలవుతున్నామని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు. చేసేదేమీలేక చివరికి కలెక్టర్‌ను కలిసి వారి సమస్యలను వివరించారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ జీతాలు రావడానికి ఇంకా నెల రోజులు పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అప్పటివరకు పాల బాకీ, ఇంటి అద్దెలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేసే పరిస్థితి వస్తుందేమో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల జీతం రాకపోతేనే ఇబ్బందిపడతాం. అలాంటిది మూడు నెలలు లేకపోతే ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు ఎలా బతకాలి. చాలా చిన్న జీతగాళ్లం మేము. అధికారులు మమ్మల్ని అర్థం చేసుకుని వెంటనే జీతాలు ఇవ్వాలని వేడుకుంటున్నాం.
– చప్పిడి శ్రీనివాసరావు, ఆరోగ్యమిత్ర, కొత్తగూడెం
16 సంవత్సరాలుగా ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాను. ఎప్పుడూ జీతాలు ఆగలేదు. ఇప్పుడే ఈ నెలతో మూడో నెల. చాలా ఇబ్బందిగా ఉంది. అసలే ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో జీతాలు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు జీతాలు వచ్చేలా చూడండి.
– ఎం.లలిత, ఆరోగ్యమిత్ర, ఇల్లెందు
కేవలం జీతం మీదే బతుకుతున్నాం. ఎలాంటి వ్యాపారాలు లేవు. ఇంత తక్కువ జీతంతో బతకడం చాలా కష్టంగా ఉంది. అందులో మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎవరితో చెప్పుకోలేక సతమతమవుతున్నాం. దయచేసి ఉన్నతాధికారులు ఆలోచించి జీతాలు ఇప్పించాలి.
– మడకం చిరుమప్ప, ఆరోగ్యమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు