ఖమ్మం, జూన్ 29: ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్‌కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని టీన్జీవోస్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు గురువారం గుర్తుచేసుకున్నారు. ఉద్యమ రోజుల్లో సాయిచంద్ పాటల ప్రవాహాన్ని తలచుకొని విలపించారు. బరువెక్కిన గుండెలతో ఆయనకు నివాళి అర్పించారు. తన పాటతో.. తన ఆటతో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సాంస్కృతిక వారధికి ‘నమస్తే’ అర్పిస్తున్న నివాళి ఇదీ..!
విద్యార్థి దశ నుంచే పాటలపై ఆసక్తి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాయిచంద్‌కు విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. పాటలపైనా మక్కువ. ఓ విద్యార్థి సంఘంలో కొన్ని ఏండ్లు కొనసాగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చారు. నాటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల పై పాటలు కట్టి పాడారు. ఆయనకు ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంతోపాటు పలు గ్రామాలకు చెందిన కవులు, ప్రజా గాయకులతో అనుబంధం ఉన్నది. విద్యార్థి సంఘంలో నాయకుడిగా పని చేసిన తర్వాత అరుణోదయ సాంసృతిక సంస్థలో సభ్యుడిగా చేరారు. అక్కడ ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
2010లోనే మొదటిసారి గుండెపోటు..
2010లో కొత్తగూడెంలో జరిగిన ధూంధాం ప్రదర్శనకు హాజరైన సాయిచంద్ అనంతరం పాటల రికార్డింగ్ కోసం మహబూబాబాద్ వెళ్లారు. అక్కడ సాయిచంద్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే సాటి ప్రజాగాయకులు కొమిరె వెంకన్న, జయరాజ్ ఆయన్ను ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఆ సమయంలో వామపక్ష పార్టీలకు చెందిన పోటు రంగారావు, కాకి భాస్కర్, జి.రామయ్య, అశోక్, పుల్లయ్య ఆయనకు అండగా నిలిచారు.
మలిదశ ఉద్యమంలో….
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించాడు సాయిచంద్. సకల జనుల సమ్మెతో పాటు అన్ని ఉద్యోగ, విద్యార్థి, న్యాయవాద, వైద్య సంఘాల సమావేశాల్లోనూ తన గళాన్నెత్తి పాటలతో సాయిచంద్ ఉర్రూతలూగించారు. ఉద్య మ సమయంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో జరిగిన న్యాయవాదుల జేఏసీ సభలో పాల్గొని తన పాటలతో ఆకట్టుకున్నారు.
తెలంగాణ వచ్చాక….
తెలంగాణ వచ్చాక జిల్లాలో జరిగిన అనేక టీఆర్ఎస్ సభలకు సాయిచంద్ హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక గతేడాది నవంబర్‌లో రఘునాథపాలెం మండలంలోని నిర్మించిన గోడౌన్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ప్రజాప్రతినిధులు, ప్రముఖుల నివాళి..
ప్రజా గాయకుడు సాయిచంద్ మృతికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తెలంగాణ సాంసృతిక రంగానికి, సమాజానికి తీరని లోటు అని శ్లాఘించారు. పాట నిలిచి ఉన్నంత వరకూ సాయిచంద్ పాట రూపంలో జీవిస్తాడని పేర్కొన్నారు. సాయిచంద్ బతికినంత కాలం ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాడన్నారు. ఆయన సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు.