ఖమ్మం, అక్టోబర్ 5: నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం వరంలాంటిదని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సొంతింటి కల సాకారమైన వారంతా సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. తొలుత భక్తరామదాసు కళాక్షేత్రంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పథకాలు కొనసాగాలన్నా, మరింత మందికి అందాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. అలాగే, సీఎం కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.
ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దాం
నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి అజయ్ పేర్కొన్నారు. నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. 10, 26, 37, 39, 40, 42, 45వ డివిజన్లలో రూ.2.10 కొట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ సురభి, కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, ఫాతిమా, బచ్చు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, కర్నాటి కృష్ణ, దాదే అమృతమ్మ సతీశ్, మడూరి ప్రసాద్, పాకాలపాటి విజయనిర్మల శేషగిరిరావు, పగడాల నాగరాజు, కన్నం లక్ష్మీప్రసన్న, పునుకొల్లు రాంబ్రహ్మం, గౌతం బాబా, కొండల్, అసిఫ్, మల్లీశ్వరి, పగడాల శ్రీవిద్య, శీలంశెట్టి రమా వీరభద్రం, మాడురి ప్రసాద్, బుర్రి వెంకట్‌కుమార్, మాటేటి అరుణ, పసుమర్తి రామ్మోహన్, బుడిగం శ్రీను, తోట రామారావు, మాటేటి నాగేశ్వర రావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్‌కుమార్, కన్నం ప్రసన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.