జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. అప్పటికే జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకాయి.
వ్యవసాయ పనులు సైతం ప్రారంభమయ్యాయి.. కానీ.. ఆ సమీక్షలో ‘వనమహోత్సవం’ ఎజెండా లేకపోవడం గమనార్హం. రుతుపవనాలు జిల్లాను తాకినప్పటికీ మొక్కలు నాటే విషయంలో ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులకు పట్టింపు లేకపోవడం అత్యంత బాధాకరం. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లావ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేవారు.. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
హరితహారం.. రాష్ట్రంలో ఈ పదం తెలియని వారు లేరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం హరితహారాన్ని ప్రారంభించింది. అడవులు తగ్గి, చెట్లు లేక వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వానలు రాక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చిన్నవి కావు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. దీనిని దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పదేండ్లపాటు దిగ్విజయంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదిగి ఎంతోమందికి నీడనిస్తున్నాయి. అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఫారెస్టు భూముల్లో నాటిన మొక్కలు ఈరోజు పెద్దపెద్ద చెట్లుగా అవతరించాయి. అంతేకాకుండా ఖమ్మం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, చెరువు గట్లపైన, కాలువల పక్కన, ప్రభుత్వ భూములు, పార్కులు, కార్యాలయాల్లో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటారు.
ఈ రోజున అవి పెరిగి పెద్ద కావడంతో వాటిని నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆనందానికి అవధులు లేవు. ప్రభుత్వ శాఖల అధికారులకు టార్గెట్లు ఇచ్చి మొక్కలను నాటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హరితహారం పేరును వన మహోత్సవంగా మార్చారు.. కానీ.. రెండు సంవత్సరాలుగా జిల్లాలో పెద్దగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగట్లేదు. కేవలం వివిధ శాఖల అధికారులకు టార్గెట్లు మాత్రం ఇస్తున్నారు.. క్షేత్రస్థాయిలో మొక్కల పెంపకం, మొక్కల పంపిణీపై మాత్రం శ్రద్ధ లేదు.
లక్ష్యం ఉన్నా.. ఆచరణ సున్నా..
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35 లక్షల 32 వేల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. వాటిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 5,47,200, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 11,54,800, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 1,13,700, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3,44,800, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 2,29,900, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 81,200, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 8,42,400, విద్యాశాఖ ఆధ్వర్యంలో 10 వేలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 30 వేలు, మైన్స్ ఆధ్వర్యంలో 46 వేల మొక్కలు నాటేలా ప్రణాళికను రూపొందించారు. కానీ.. అటవీ, డీఆర్డీఏ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో తప్ప మిగిలిన శాఖల ఆధ్వర్యంలో ఎక్కడా మొక్కలు పెంచుతున్న దాఖలాలు లేవు.
ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం..
ఆకుపచ్చ తెలంగాణను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఖమ్మం జిల్లావ్యాప్తంగా పదేండ్లు విజయవంతంగా కొనసాగింది. కోట్ల మొక్కలను నాటారు. అవి ఈరోజున వృక్షాలుగా పెరగడంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్టయింది. ఆ వనాల్లో నేడు ప్రజలు సేద తీరుతున్నారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పెరిగిన చెట్లు ప్రజలకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడంతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారం ద్వారా మొక్కలు నాటడంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ప్రజలే స్వచ్ఛందంగా నర్సరీల వద్దకు వచ్చి వారికి అవసరమైన మొక్కలను తీసుకెళ్లేవారు.
పల్లె ముంగిట్లో నర్సరీలు..
కేసీఆర్ తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు తగ్గకుండా పంపిణీ చేయాలని చట్టం రూపొందించారు. వాణిజ్య మొక్కల కింద టేకు, సుబాబుల్, జామాయిల్ క్లోన్స్, పూలమొక్కల్లో టేకోమ, గన్నేరు, మందార, పండ్ల మొక్కల్లో ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, నీడనిచ్చే మొక్కల కింద వేప, గానుగ, రావి, మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహర్ తదితర మొక్కలను నాటారు. ప్రతిరోజు ప్రజలకు అవసరం వచ్చే మొక్కలతోపాటు పండ్లు, టేకు, ఉసిరి తదితర మొక్కలు కూడా పంచారు. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నట్లు జిల్లాలోని 500 నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచాలి.. కానీ.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని పట్టించుకున్న నాథుడే కరువయ్యారు.