ఖమ్మం, జూన్ 1 : ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల జీవితాల్లో సమూల మార్పును తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటారని బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు ఘనంగా జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గత పదేండ్లలో ఎంతో ప్రగతి సాధించుకున్నామని, ప్రతి తెలంగాణ బిడ్డ సగర్వంగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిగా కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కష్టపడి సాధించుకొని, అభివృద్ధి చేసుకున్న తెలంగాణను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని, కేసీఆర్‌కు అండగా నిలవాలని నామా కోరారు.