కారేపల్లి, సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో గల పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో చేతి బోర్ పంపులు నిరుపయోగంగా మారుతున్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్న బోరు పంపులపై సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల తుప్పుపట్టిపోతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీటిని సరఫరా చేశారు. ఇప్పటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీళ్లే గ్రామీణ ప్రాంతాల ప్రజల నీటి ఎద్దడిని తీరుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించిన పైప్లైన్లు పగిలి, లీకై త్రాగునీరు వృథాగా పోతుంది. రక్షిత నీటి పథకం ద్వారా పలుచోట్ల సక్రమంగా త్రాగునీరు సరఫరా కావడం లేదు.
పైపులకు రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మరమ్మతులు చేపట్టాలంటే నిధుల కొరత వేధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల వాడుకకు చేతి పంపు బోరు నీళ్లే ఆధారం. కనీసం గ్రామాల్లో ఉన్న చేతి బోరు పంపుల నిర్వహణపై ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రజలకు నీటి సమస్య తప్పడం లేదు. గ్రామాల్లో వాడుకలో లేని చేతి పంపులను రోజువారి వాడుక నీటి అవసరాల నిమిత్తం ఉపయోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సింగరేణి మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ ను నమస్తే తెలంగాణ వివరణ అడగగా మండల వ్యాప్తంగా 387 చేతి బోరు పంపులు ఉన్నట్లు తెలిపారు. వాటిల్లో సుమారు 30 చేతి పంపులు మరమ్మతులకు గురైనట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వల్ల మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని వెల్లడించారు.