అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి కోసం సకాలంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతోంది. కర్షకుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు చెల్లింపులను కూడా సకాలంలో చేయడం లేదు. దీంతో సకాలంలో పెట్టుబడి అందక, అమ్ముకున్న పంటల పైకం సీజన్ నాటికి చేతికి రాక కాంగ్రెస్ పాలనలో కర్షకులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సీజన్ నాటికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని కారణంగా అధిక వడ్డీలైనా అప్పులు చేయాల్సిన పరిస్థితి.
గత కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయం కూడా ఈ కాంగ్రెస్ పాలనలో గాడి తప్పింది. గడిచిన రెండున్నరేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా మూడుసార్లు రైతుభరోసాకు ఎగనామం పెట్టిందంటే రైతు సంక్షేమం పట్ల ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదీగాక, రైతులంతా రెక్కలు ముక్కలు చేసుకొని, ఎండకు ఎండి, వానకు తడిచి, ఎండా వానల నుంచి పంటను కాపాడి తీసుకొచ్చిన పంటను కూడా ఇదే ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదు. అన్నదాతల ఆర్తనాదాలు, రైతు నేతల ఆందోళనలతో చివరాఖరుకు కొనుగోలు చేసినా.. ఆ చెల్లింపులను ఇంకా పూర్తిచేయలేదు. ధాన్యం బోనస్ నగదు, మక్కల కొనుగోళ్ల చెల్లింపులే ఇందుకు ఉదాహరణ.
-రఘునాథపాలెం, జూలై 2
ఖమ్మం జిల్లాలో గత యాసంగి సీజన్లో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇందుకుగాను మొత్తం రూ.684 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇందులో రూ.384 కోట్లు మాత్రమే ఇప్పటికి విడుదల చేసింది. ఇంకా రూ.300 కోట్ల చెల్లింపులు రైతులకు బకాయి పడింది. ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా యాసంగి నాటి బకాయిలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో పంటల పెట్టుబడి కోసం మక్క రైతులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్న, చిన్నకారు రైతులందరూ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టి అధిక వడ్డీలకు పెట్టుబడి నగదు తెచ్చుకోవాల్సిన దయనీయ స్థితి. ఇక ఈ వానకాలం సీజన్‌కు గానూ 3.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి, 2,465 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా వేశారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం బోనస్ డబ్బులు, మొక్కజొన్న డబ్బులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
రూ.30 కోట్ల దాకా ‘బోనస్’ బకాయి
గత యాసంగిలో ఖమ్మం జిల్లాలో 3.58 లక్షల మంది రైతులు వరి సాగు చేశారు. ఇందుకుగాను సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ బోనస్ నగదును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో సన్న వడ్లను, దొడ్డు వడ్లను గ్రేడింగ్ చేయాల్సి ఉన్నందున సరైన గణాంకాలు లేవని అధికారులు చెబుతున్నారు. గ్రేడింగ్ పూర్తయ్యాకే పూర్తిస్థాయి గణాంకాలు నిర్ధారణ అవుతాయని, అప్పుడే బోనస్ చెల్లింపులు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. సుమారు రూ.30 కోట్ల వరకూ బోనస్ నగదు చెల్లించాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
డబ్బులు వెంటనే జమ చేయాలి
వానకాలం వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాక ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, కూలీల ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక మంది రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటున్నారు. రైతులు అప్పులపాలు కాకుండా ఉండాలంటే మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు డబ్బులను ప్రభుత్వం వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి.
– బొంతు రాంబాబు, రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు