మామిళ్లగూడెం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్/ పాల్వంచ/ పాల్వంచ రూరల్/ కొణిజర్ల, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్-3 పరీక్షల ప్రక్రియ మొదటి రోజు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అయితే, అభ్యర్థుల హాజరు శాతం భద్రాద్రి జిల్లాలో భారీగా తగ్గింది. అయితే, ఖమ్మం జిల్లాలో ఎంతమంది హాజరయ్యారన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో కలిపి 39 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
మొత్తం 13,478 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా 7,238 మంది హాజరయ్యారు. 6,244 మంది గైర్హాజరయ్యారు. మొత్తమ్మీద 53.67 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగానే అభ్యర్థులు చేరుకోవడంతో బయోమెట్రిక్ విధానం ద్వారా వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించలేదు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ రాసేందుకు అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. 27,984 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది.
అయితే, జిల్లాలో విద్యార్థుల హాజరు శాతాన్ని వెల్లడించేందకు టీజీపీఎస్సీ అధికారుల అనుమతి లభించలేదు. రాష్ట్రస్థాయిలో టీజీపీఎస్సీనే హాజరు శాతాన్ని ప్రకటిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మొదటి సెషన్‌కు ఉదయం 8:30 గంటల నుంచే అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల పరీక్ష జరిగింది. రెండో సెషన్లో 1:30 నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. సాయంత్రం 5:30కు పరీక్ష ముగిసింది. ప్రతి హాల్లో 24 మంది అభ్యర్థులకు మాత్రమే సీటింగ్ ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ మూడో పేపర్ పరీక్ష జరుగనుంది.
భద్రాద్రి జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వసంత్, ఎస్పీ రోహిత్‌రాజు వేర్వేరుగా తనిఖీ చేశారు. రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని ఎస్పీ రోహిత్‌రాజు తనిఖీ చేశారు. కొత్తగూడెంలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న కలెక్టర్‌ను కూడా పోలీసులు తనిఖీ చేసి అనుమతించారు. ఇక ఖమ్మంలోని పలు పరీక్ష కేంద్రాలను సీపీ సునీల్‌దత్ పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రాల చిరునామా తప్పుగా ప్రచురితం కావడంతో పాల్వంచ మండలంలో కొందరు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, మణుగూరుకు చెందిన నాగవేణి పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. సమయం దాటిపోయాక రావడంతో అధికారులు ఆమెను అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుతిరిగింది.