మామిళ్లగూడెం, నవంబర్ 18: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-3 రాత పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మంలో 87 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి రెండో రోజు పరీక్ష రాశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ఆయా కేంద్రాలను సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు సందర్శించారు. అభ్యర్థులను ఉదయం సెషన్లో 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లో లోపలికి అనుమతించారు. అయితే ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారనే వివరాలను రాష్ట్రస్థాయి అధికారులు ప్రకటిస్తారని నిర్వాహకులు తెలిపారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 18: జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా.. అభ్యర్థులు రెండో రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అభ్యర్థులు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా.. కొత్తగూడెం లో 26, పాల్వంచలో 13 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 13,478 మంది అభ్యర్థులకు గాను 7,166 మంది పరీక్ష రాశారు. 53.17 హాజరు శాతం నమోదైంది. కలెక్టర్, ఎస్పీలు పరీక్షా సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సెంటర్లను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.